Andhra Pradesh Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. సోమవారం నాడు తాడెపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. రాజ్యాంగ సంస్థల ఆదేశాలను గౌరవిస్తామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వానిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నిలకల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. అయితే కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుందని చెప్పినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినలేదన్నారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, ఇక ఏం జరిగినా ఎస్ఈసీ నే బాధ్యత వహించాలని సజ్జల స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేసి పంచాయతీ ఎన్నికలను తీసుకురావడంలో రాజకీయ కుట్ర దాగి ఉందని సజ్జల ఆరోపించారు.
ఇదిలాఉంటే.. ఎస్ఈసీ మొండి వైఖరి వల్లే సుప్రీంకోర్టు పిటిషన్ వేశామని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే తమకు ముఖ్యమని ఎస్ఈసీకి వివరించామని అయినా ఆయన వినలేదన్నారు. ఈ కారణంగానే తొలుత హైకోర్టులో, ఆ తరువాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే గందరగోళ పరిస్థితికి దారితీస్తాయని సుప్రీంకోర్టుకు వివరించామన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో వ్యాక్సినేసన్‌పై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులు ఎన్నికలను వ్యతిరేకించడంపై స్పందించిన ఆయన.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని, వాళ్ల ప్రాణాలు కూడా తమకు ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులతో చర్చించిన తరువాత సీఎస్ నిర్ణయం తీసుకుంటారని, అక్కడ అదే జరిగిందని సజ్జల చెప్పుకొచ్చారు.
కాగా, దీనికి ముందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక అధికారులు, మంత్రులు, ముఖ్య నేతలతో అత్యవసర సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణపై వారితో సమాలోచనలు చేశారు. ఈ భేటీలో సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరామ్, సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Also read:
Telecom Industry: లైసెన్స్ ఫీజులు తగ్గించాలి… జీఎస్టీని రద్దు చేయాలని టెలికాం కంపెనీల డిమాండ్…