మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఓ హోంగార్డ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. ఆ హోమ్ గార్డ్ స్థిర, చర ఆస్తులు విలువ చూసి ఏసీబీ అధికారులు నోరెళ్లబెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హోమ్ గార్డ్ వద్ద ఇంత భారీ మొత్తం ఆస్తులు ఉండడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టిస్తుంది. ఇంతకు అతని ఆస్తుల విలువెంతో తెలుసా?

మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే
Home Guard Corruption

Edited By:

Updated on: Jan 29, 2026 | 7:29 PM

విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న నెట్టి శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గుర్ల మండలంతో పాటు విశాఖపట్నంలో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసరావు భారీగా చర, స్థర ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం: శ్రీనివాసరావు గతంలో సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహించారు. అలా ఏసీబీ కార్యాలయంలో పనిచేసిన శ్రీనివాస్ అదే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అవినీతి అధికారులకు ఎసిబి పై ఉన్న భయాన్ని అడ్డుపెట్టుకొని పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇతని పై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏడాది క్రితం ఏసీబీ అధికారులు ఆయనను జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఏసీబీలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నెలవారీ వసూళ్లు, జిల్లా స్థాయి అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం, అలాగే ఆకాశరామన్న లెటర్స్ పేరుతో అధికారుల పై ఫిర్యాదులు వచ్చాయని వారిని హెచ్చరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే జిల్లాలోని పలువురు రెవెన్యూ అధికారులను బెదిరించి జగనన్న కాలనీల్లో సుమారు 50కి పైగా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా సొంతం తనతో పాటు తన బంధువులు, కుటుంబసభ్యుల పేరిట సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. విశాఖపట్నం, విజయనగరం సహా పలు ప్రాంతాల్లో స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు మార్కెట్ వాల్యూ ప్రకారం శ్రీనివాసరావు సుమారు 20 కోట్ల వరకు అక్రమంగా సంపాదించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆస్తుల వివరాలు, లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా హోం గార్డ్ శ్రీనివాస్ డైరీలో రాసిన కీలక ఆధారాలు సేకరించారు. ఏ ఏ అధికారి నుంచి ఎంత వస్తున్నాయి? వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, పలువురు జిల్లా అధికారులతో పాటు గతంలో ఎసిబిలో పనిచేసిన పలువురు అధికారుల ఆర్థిక లావాదేవీలు అన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.