Women’s Day 2022: సాధారణ గృహిణి నుంచి కోట్ల టర్నోవర్ దాకా.. విజయనగరం జిల్లా మహిళ విజయగాథ

|

Mar 08, 2022 | 11:20 AM

ఒకప్పుడు ఆమె సాధారణ గృహిణి. ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. అంతే కాదు.. దేశ, విదేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతులతో అందరి మన్ననలు పొందుతూ పారిశ్రామికవేత్తగా మారారు.. కోట్ల రూపాయల టర్నోవర్...

Womens Day 2022: సాధారణ గృహిణి నుంచి కోట్ల టర్నోవర్ దాకా.. విజయనగరం జిల్లా మహిళ విజయగాథ
Vzm Woman
Follow us on

International Women’s Day 2022: ఒకప్పుడు ఆమె సాధారణ గృహిణి.. ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న సక్సెస్ ఫుల్ ఉమెన్.. అంతే కాదు.. దేశ, విదేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతులతో అందరి మన్ననలు పొందుతూ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఎన్నో ఒడుదొడుకులు, మరెన్నో సవాళ్లు. ఇలా ఒక్కొక్క సమస్యను అధిగమించి విజయపథం వైపు దూసుకెళ్లారు విజయనగరం(Vizianagaram) జిల్లాలోని ఓ మహిళ. ఆమె పేరు అన్నాడి సునీత. ఇంజినీరింగ్ విద్యలో చేరాక కొద్ది రోజులకే ఆమెకు వివాహమైంది. దీంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది. వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నా ఏదో ఒకటి సాధించాలనే తపన మాత్రం ఆమెను కలవరపాటుకు గురి చేసేది. ఆ క్రమంలోనే ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నారు. మహిళల వంటింటికి అవసరమైన పసుపు తయారీ(Turmeric Powder) వైపు దృష్టి సారించారు. వ్యాపారం మొదట్లో పరిస్థితులు అంతగా సహకరించలేదు. ఫలితంగా ఇంట్లోనే స్వతహాగా పసుపు తయారీ చేసి విక్రయించడం ప్రారంభించారు. పసుపు తయారీ కోసం అవసరమైన పసుపు కొమ్ములు సేకరించేందుకు ఏజెన్సీకి వెళ్లే వారు. సంతలతో పాటు నేరుగా రైతుల వద్దకు వెళ్లి పసుపు కొమ్ములను కొనుగోలు చేసేవారు. తరువాత కొద్దిరోజులకు వ్యాపారం బాగా సాగడంతో మరో ఐదుగురుని పనిలోకి తీసుకున్నారు.

ఆమె తపన, కష్టపడే తత్వాన్ని గమనించిన భర్త, ఇతర కుటుంబ సభ్యులు తమవంతు సహకారం అందించేవారు. భర్త ముడి పదార్ధాలు కొనుగోలు చేస్తే సునీత ఆర్గానిక్ పసుపు తయారీలో నిమగ్నమయ్యేవారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఆగిపోయిన చదువుపై కూడా దృష్టి సారించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్ఏ, ఎమ్ బీఏ పూర్తి చేశారు. ఓ వైపు చదువు, మరో వైపు వ్యాపారంలో బిజీగా గడుపుతూ లక్ష్యం వైపు అడుగులు వేశారు. అలా 2005లో ఒక కుటీర పరిశ్రమగా ప్రారంభమైన వ్యాపారం నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. పసుపుతో పాటు, కుంకుమ, మసాలా పౌడర్స్ కూడా తయారుచేసి విశేష ఆదరణ పొందారు. సునీత తయారు చేసేత ఉత్పత్తులన్నీ పూర్తిగా ఆర్గానిక్ కావటంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం వీటికి మంచి గిరాకీ వచ్చింది. కేరళ, చెన్నై లలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఈమె తయారు చేస్తున్న పసుపు, కుంకుమలను పూజా కైంకర్యాలకు వాడుతున్నారు.

 

Sunita

క్షేత్రస్థాయి నుంచి స్వయంశక్తితో ఉన్నత స్థానానికి వచ్చిన పారిశ్రామిక వేత్త సునీతకు ఇంకా ఏదో చేయాలనే తపన మాత్రం పోలేదు. తమ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసి.. నాణ్యమైన ఉత్పత్తులను దేశంలోని అన్ని ప్రాంతాలకు అందేలా, ప్రతి వంటింటి మహిళకు చేరేలా పనిచేయటమే తన ఏకైక లక్ష్యం అని అంటున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, గమ్యానికి చేరుకోవడానికి సునీత పడుతున్న కష్టాన్ని చూసిన వారు సునీత ఒక స్ట్రాంగ్ అండ్ సక్సెస్ ఫుల్ ఉమెన్ అని కొనియాడుతుంటారు.

 -గమిడి కోటేశ్వరరావు, టీవీ9 తెలుగు, విజయనగరం

Also Read

Two Wheelers: కష్టాల్లో దేశీయ టూవీలర్ పరిశ్రమ.. వారి నుంచి డిమాండ్ తగ్గటమే కారణం..

Biggest Cruise Ship: అలలపై కదిలే నగరం !! 2,867 రూములు అధ్భుత నిర్మాణం !! వీడియో

Women’s Day 2022: తగ్గేదే లే అంటున్న ఆటో అతివలు.. ఆటో డ్రైవర్ వృత్తితో బతుకు బండి నడుపుతున్న నారీమణులు..