విశాఖపట్టణం సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ – 2022 ఉత్సాహంగా సాగింది. ఫుల్ మారథాన్, హాల్ఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీల్లో మారథాన్ నిర్వహించారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో నిర్వహించిన నేవీ మారథాన్ కు విశేష స్పందన లభించింది. క్రీడాకారులు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేవీ మారథాన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫుల్ మారథాన్ (42కె), ఆఫ్ మారథాన్ (21కె), 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. తొలుత ఆర్కేబీచ్ సమీపంలోని కాళీమాత ఆలయ ఆవరణలో నేవీ అధికారులు, సినీనటులు మిలింద్ సోమన్, అడివి శేష్ జెండా ఊపి ఈ మారథాన్‌లను ప్రారంభించారు. ఫుల్ మారథాన్ ఐఎన్‌ఎస్ కళింగ వద్ద ముగిసింది.
నేవీ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత సాగర తీరానికి తరలిరావడంతో సందడి నెలకొంది. ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. వైజాగ్ నేవీ మారథాన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినీ నటుడు అడవి శేష్. 5కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.
తాను యాక్టర్‌ను మాత్రమేనని.. మారథాన్‌లో పాల్గొన్న వారే నిజమైన హీరోలని అభివర్ణించారు అడవి శేష్. విశాఖ తనకు ఇష్టమైన ఊరని చెప్పిన అడవి శేష్, ఇక్కడే ఎక్కువకాలం ఉన్నానన్నారు. బీచ్ రోడ్ లో గడిపిన రోజులు గుర్తుకువస్తున్నాయని తెలిపారు. హిట్ సినిమా విశాఖలోనే షూటింగ్ జరిగిందన్నారు. నేవీ మారథాన్ చూడగానే తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అడవి శేషు. నేవి మార్ థాన్ సందర్భంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్డు వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..