Visakha Steel plant privatisation : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై ఉండదన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. గాజువాక మండలం మింది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రంతో వైసీపీ పోరాడుతుందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకు ని తీరుతాం అని వైసీపీ ఎమ్మెల్యే శపథం చేశారు. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ తో కూడికున్న అంశం అన్న ఆయన ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ దీనిపై తీవ్రమైన పోరాటం చేస్తుందని వెల్లడించారు.
ఇలాఉండగా, ఏపీ మున్సిపల్ పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు మొత్తం 32.23 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లాలో- 32.64 శాతం, చిత్తూరు జిల్లాలో – 30.12 శాతం, ప్రకాశంలో – 36.12 శాతం, కడపలో – 32.82 శాతం, నెల్లూరు జిల్లాలో – 32.67 శాతం, విశాఖలో – 28.50 శాతం, కర్నూలులో – 34.12 శాతం, గుంటూరులో – 33.62 శాతం, శ్రీకాకుళంలో – 24.58 శాతం, తూర్పుగోదావరిలో – 36.31శాతం, అనంతపురంలో – 31.36 శాతం, విజయనగరం జిల్లాలో – 31.97 శాతం, పశ్చిమ గోదావరిలో- 34.14 శాతంగా నమోదయ్యాయి.