Vizag: విశాఖ పోలీసుల రికవరీ మేళా.. నిజంగా సూపర్ ఐడియా సార్

ఇంట్లో చోరీ జరిగిందని.. పార్క్ చేసిన బైక్ పోయిందని.. షాప్‌లో ఎలక్ట్రానిక్ గూడ్స్‌ పోయాయని తలలు పట్టుకుంటున్నారా? పోలో మంటూ పోలీస్‌ స్టేషన్‌కు పరుగు పెడుతున్నారా? అంత టెన్షన్ అక్కర్లేదు.. బీ కూల్ అని భరోసానిస్తున్నారు పోలీసులు. అదేంటి..? సొత్తు పోతే కూల్‌గా ఎలా ఉంటారని ఆశ్చర్య పోతున్నారా..? అయితే ఈ కథనంలో వివరాలు తెలుసుకుందాం పదండి..

Vizag: విశాఖ పోలీసుల రికవరీ మేళా.. నిజంగా సూపర్ ఐడియా సార్
Vizag Police Recovery Mela

Updated on: May 24, 2025 | 7:45 PM

కుంభమేళా.. జాబ్ మేళా.. హస్తకళా మేళా.. ఇలా ఎన్నో మేళాలు విన్నాం.. చూశాం. కానీ రికవరీ మేళా ఎప్పుడైనా విన్నారా..? క్రైమ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ నిర్వహించారు విశాఖ పోలీసులు. సీపీగా వచ్చినప్పటి నుంచి వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న శంఖబ్రత బాగ్చీ.. రికవరీ మేళా నిర్వహించి.. బాధితుల కళ్లల్లో ఆనందం నింపారు.

ఏప్రిల్‌లో 123 కేసులు నమోదయ్యాయి. ఇందులో 98 కేసుల్ని ఛేదించారు. వీటిలో రాబరీ, హౌస్ బ్రేకింగ్‌, స్నాచింగ్‌, బైక్ థెప్టింగ్ లాంటివి ఉన్నాయి. 81మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. అలాగే చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లు రికవరీ చేశారు. వందల ఫోన్లు.. తులాలకొద్ది బంగారం.. లక్షల్లో కరెన్సీ.. ఎలక్ట్రానిక్‌ పరికరాలు.. ఖరీదైన బైక్‌లు.. వీటి విలువ అక్షరాలా కోటి రూపాయల 53వేల రూపాయలు. వీటన్నింటిని సీపీ సమక్షంలో బాధితులకు అందించారు.

కోర్టు అనుమతితో సీజ్ చేసిన సొత్తును.. బాధితులకు అందించేందుకు రికవరీ మేళా నిర్వహించారు. ఇది ప్రతినెలా ఉంటుందన్నారు సీపీ. చరిత్రలో ఇలా చేయడం మొదటిసారన్నారు.

చాలాచోట్ల మొబైల్‌ ఫోన్లను రికవరీ చేస్తున్న పోలీసులు ఎప్పటికప్పుడు బాధితులకు అందజేస్తున్నారు. కానీ విశాఖ పోలీసులు ఏకంగా అన్ని కేసుల్లో సొత్తును రికవరీ చేసి అందించడంపై అన్ని వర్గాలు ఆనంతం వ్యక్తం చేస్తున్నాయి. వేర్వేరు కేసుల్ని ఛేదించి సొత్తును రికవరీ చేయడంలో చాలామంది పోలీసులు కృషి చేశారు. వాళ్లందర్నీ అభినందించారు సీపీ.