విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో ఉద్రిక్తత.. పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు.. భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌

|

Mar 09, 2021 | 2:06 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్టీల్‌ సిటీ భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో ఉద్రిక్తత.. పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు.. భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌

Visakha Steel Plant: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్టీల్‌ సిటీ భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. కేంద్రం ప్రకటనతో సాగర తీరం అట్టుడికిపోతోంది. ఎటు చూసినా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. రాత్రి నుంచి స్టీల్‌ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రహదారులను దిగ్బంధించారు. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ దగ్గర ఆందోళనలకు దిగారు. పోలీసులు చర్చలు జరిపినా..వెనక్కి తగ్గడం లేదు ఉద్యమకారులు. ఉక్కు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు.

పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి మొండిచెయ్యి చూపింది కేంద్రం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు రామాయపట్నం పోర్టు విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిల్చింది. ఇవాళ స్టీల్‌ ప్లాంట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించిన ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామంటున్నారు.

అటు, జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ మేయిన్‌ గేట్‌ దగ్గర ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటన ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ విశాఖలోని స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇదిలావుంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉక్కు ఉద్యమానికి అజ్యం పోసినట్లైంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2021 01:22 PM (IST)

    26వ రోజుకు చేరిన కార్మికుల రిలే నిరాహారదీక్ష

    కార్మికుల రిలే నిరాహార దీక్ష 26వ రోజుకు చేరాయి. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అందరూ రోడ్లపైకి రావాలని యువత పిలుపనిస్తోంది. స్టీల్‌ ప్లాంట్ గేటు ముందు ధర్నాలతో ప్రయోజనం లేదని… రోడ్లపైకి వస్తేనే కేంద్రానికి సెగ తగులుతుందని అభిప్రాయపడుతున్నారు.

  • 09 Mar 2021 01:17 PM (IST)

    స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుల మద్దతు

    ఇన్నాళ్లూ కార్మికులు మాత్రమే ఉద్యమాన్ని ముందుండి నడించారు. ఇప్పుడు సీతారామన్ ప్రకటనతో స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు కూడా ఉద్యమంలోకి దూకారు. దీంతో ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గళమెత్తారు.


  • 09 Mar 2021 12:59 PM (IST)

    ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

    స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం ప్రకటించిన వేళ… ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరారు. కార్మిక సంఘాల నేతలతో కలుపుకుని అఖిలపక్షంతో వస్తామని, వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు పేజీలతో ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు.

  • 09 Mar 2021 12:03 PM (IST)

    ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలిః గంటా

    చివరి అస్త్రంగా రాజీనామాలు చేయాల్సిన సమయం వచ్చేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. స్టీల్ ఫ్లాంట్‌పై ఇక, ముఖ్యమంత్రి జగనే కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. దీనిపై అధికార పార్టీనే కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

  • 09 Mar 2021 11:54 AM (IST)

    తనిఖీ అనంతరం అనుమతి

    పరిపాలన భవనాన్ని ఉద్యమకారులు ముట్టడికి పిలుపుఇవ్వడంతో ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పూర్తి తనిఖీలుతర్వాత ఒక్కొక్కర్ని లోపలికి పంపించారు. కానీ. గేట్‌ వద్ద నిరసనలు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

  • 09 Mar 2021 11:19 AM (IST)

    వాహనాల దారి మళ్లింపు

    విశాఖలోని నిరసనలు హోరెత్తుతున్నాయి. రహదారుల దిగ్భంధంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు. తుని వైపు వెళ్లాల్సిన వాహనాలను లంకెలపాలెం నుంచి మళ్లిస్తున్నారు. సబ్బవరం మీదుగా పంపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఏడీ జంక్షన్, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. ఎన్‌ఏడీ నుంచి కూర్మన్నపాలెం వరకు, అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు వన్‌వేలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

  • 09 Mar 2021 11:17 AM (IST)

    పరుగులు తీసిన ఫైనాన్స్‌ డైరెక్టర్ వేణుగోపాల్

    స్టీల్‌ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైనాన్స్‌ డైరెక్టర్స్‌ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది జోక్యం చేసుకొని ఆయనకు రక్షణ వలయంగా మారారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉద్యమకారులు అయినా వాళ్లను విడిచిపెట్టలేదు. ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెనుక పరుగులు తీశారు. ఆయన్ని లాగే ప్రయత్నం చేశారు.

  • 09 Mar 2021 10:25 AM (IST)

    విశాఖ డైరెక్టర్ కారును అడ్డుకున్న కార్మికులు

    విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ప్లాంట్‌లో ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటూ.. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ లోపలకి వెళుతున్న డైరెక్టర్ ఫైనాన్స్ అధికారి కారును పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు.

  • 09 Mar 2021 10:09 AM (IST)

    స్తంభించిన జాతీయ రహదారి

    సోమవారం రాత్రి నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కార్మికుల ఆందోళనలకు పార్టీలు, మిగిలిన కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధించిన కార్మికులు ఆందోళన చేపట్టారు.

Follow us on