Visakhapatnam – Airport – Bullets: సాగరనగరం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్ల కలకలంపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. నిన్న మహిళా ప్రయాణికురాలు నుంచి 13 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన తమ పెదనాన్నకు చెందిన బ్యాగుగా చెబుతున్నారు అరవయ్యేళ్ళ సుజాత. సుజాత వివరణలో వాస్తవమెంత అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన సుజాత బ్యాగ్ నుంచి ఎయిర్ పోర్ట్ స్కానర్లో తుపాకీ బుల్లెట్లు బయటపడ్డాయి.
తమ పాత ఇల్లు దుమ్ము పట్టి పోవడంతో వస్తువులు సర్దానని, అదే క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని సుజాత అంటున్నారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. కాగా, సుజాతకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (60) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ విచారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.