Vijayasai Reddy – Vizag Steel – Nirmala Sitharaman : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు.
“అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోంది” అని విజయసాయి రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు.
ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని ఎంపీ పేర్కొన్నారు.
అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని విజయసాయి చెప్పుకొచ్చారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందన్నారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
Read also : Dasoju Sravan : ‘అది చాలా దుర్మార్గం..’ ఇచ్చిన హామీలపై ఇక న్యాయపరమైన పోరాటం : దాశోజు శ్రవణ్