
ఏపీలోకి క్రీడాకారులకు ఉపయోగపడేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఇండోర్ స్టేడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన నగరమైన విశాఖపట్నంలో ఇండోర్ స్టేడియంను అంతర్జాతీయ హంగులతో తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించింది. గత కొంతకాలం నుంచి ఆధునీకరణ పనులు జరుగుతుండగా.. ఇప్పుడు అవి పూర్తి కావడంతో తాజాగా ప్రారంభించారు. దాదాపు రూ.16.90 కోట్ల ఖర్చుతో ఈ స్టేడియంను పున:నిర్మించారు. అభివృద్ది పనులు పూర్తి కావడంతో తిరిగి ప్రారంభించారు.
ఈ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంను విశాఖపట్నం ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం మేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. అలాగే అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ మెషీన్లు, సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఆరు బ్యాడ్మింటన్ కోచ్‌లతో పాటు స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. దీని వల్ల స్టేడియంలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్టేడియంలో నామమాత్రపు ఫీజులు క్రీడాకారుల నుంచి వసూలు చేయనున్నారు. క్రీడాకారులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేడియంలో ఒకేసారి 1750 మంది ప్రేక్షకుల కూర్చొనేలా సీటింగ్ సామర్థ్యం పెంచారు. ఇక ప్రమాదాలు జరగకుండా అధునాతన ఫైర్ ఫైటింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.
స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం పున:ప్రారంభంలో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. విశాఖపట్నంను స్పోర్ట్ హాబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణ భారతి స్టేడియం అందులో భాగమేనని అన్నారు. ఈ స్టేడియం రాకతో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పోటీలో ఈ ఇండోర్ స్టేడియంలో నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ స్టేడియం క్రీడాకారులకు ఉపయోగపడుతుందని, తక్కువ ఫీజులతో సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.