జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెల్పుతూనే.. సెటైరికల్ రిప్లై ఇచ్చారు. పార్టీని వీడుతున్నందుకు కారణం పవనే అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన విధానాల్లో నిలకడ లేదని.. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు సినిమాల్లో నటించడం నచ్చకే తప్పుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ సున్నితంగా.. సెటైరికల్ రిప్లై ఇచ్చారు.
వివి లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామంటూ.. జనసేన అధికారిక ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నామని తెల్పుతూనే.. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని.. సినిమాలు చేయడమే నాకు తెలుసని.. ఇదే నాకు ఉన్న ప్రత్యామ్నాయమని.. అవన్నీ తెలుసుకుని ఉంటే బాగుండేదని.. పవన్ కల్యాణ్ అన్నారు.
“వి.వి.లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాం. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి.” అంటూ లక్ష్మీనారాయణ రాజీనామాపై విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
చివరకు పై విషయాలన్నీ తెలుసుకుని… లక్ష్మీనారాయణ తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే ఎంతో బాగుండేదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఇక చివరకు ఆయన పార్టీకి రాజీనామా చేసినా.. తమకు వ్యక్తిగతంగా ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/iBJJ4JX0KC
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2020