Bamboo chicken: ఇకపై బొంగులో చికెన్ కోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు.. సిటీలోనే.. కేజీ రేటెంతో తెల్సా..?
బొంగులో చికెన్.. పేరు వినగానే నాన్-వెజ్ ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎందుకంటే దాని టేస్టు అలా ఉంటుంది మరీ. ఈ బొంగులో చికెన్, ఇప్పటివరకూ కేవలం రెండు, మూడు ప్రాంతాల్లోనే దొరికేది. కానీ, ఇప్పుడు మాంస ప్రియుల కోసం మరింత అందుబాటులోకి వచ్చింది.
Bongulo Chicken:బొంగులో చికెన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజంగానే మన దగ్గర మాంస ప్రియులు ఎక్కువ. ఎక్కడైనా టేస్టీ నాన్‌వెజ్ దొరికితే, అస్సలు వదిలిపెట్టరు. వెరైటీ వంటకాలు, మసాలా ఐటమ్స్‌కు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. నాన్-వెజ్ లవర్స్ అస్సలు వదిలిపెట్టలేని వెరైటీ డిష్ మన బొంగులో చికెన్. వెరైటీ వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశాఖ మన్యంలో(Vizag Agency) ఇది బాగా పాపులర్. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో బొంగు చికెన్ ఎంత ఫేమస్ అయ్యిందంటే, అరకు టూర్‌కు వెళ్లిన వారు బొంగు చికెన్ తినకుండా తిరిగిరారు. మాంస ప్రియులను ఇది అంతలా ఆకట్టుకుంది. అటు, తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లోని అటవీ ప్రాంతం, తెలంగాణ(Telangana) ఖమ్మం జిల్లాలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ ఈ బొంగులో చికెన్ దొరికేది. కేవలం బొంగులో చికెన్ తినడానికే ఈ ప్రాంతాలకు వెళ్లేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, ఇప్పుడీ బొంగులో చికెన్ వైజాగ్ సిటీలోనే దొరుకుతుంది. అదే రుచి, అదే క్వాలిటీతో, ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ లవర్స్. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అని మురిసిపోతున్నారు.
ఓ గిరిజన కుటుంబం ఏజెన్సీ నుంచి బొంగులు తీసుకువచ్చి, ఈ టేస్టీ చికెన్ చికెన్‌ను సిటీలోని నాన్-వెజ్ ప్రియులకు అందిస్తుంది. కేజీ 600, అర కేజీ 300, పావు కేజీ 150 లెక్కన అమ్ముతున్నారు. ఈ బొంగులో చికెన్ వ్యాపారం మీదే ఆధారపడి విశాఖ ఏజెన్సీలో ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. తాజాగా, వారు విశాఖ సిటీలోనూ అమ్మడం ప్రారంభించి, ఫుడ్ లవర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఈ బొంగులో చికెన్‌ను వంటపాత్రల్లో కాకుండా అడవిలో లభించే వెదురు బొంగులో వండుతారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి, దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా దట్టించాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కలిపి, వెదురు బొంగులో పెట్టాలి. రెండు వైపులా ఆకులు కప్పి, మంటపై 20 నిమిషాలు వరకు కాల్చాలి. వెదురులో ఉండే సహజమైన నీటి ఆవిరికి మాంసం ఉడకడంతో, రుచి మాములుగా ఉండదు. మరో ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో వంట నూనె వాడరు. అత్యంత రుచికరమైన ఈ వంటకాన్ని తయారుచేయడం కొంతమంది గిరిజనులకే సాధ్యం.
విశాఖ మన్యం అరకులోయ నుంచి మారేడుమిల్లి వరకు ఉన్న పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఈ బొంగులో చికెన్ విరివిగా దొరకుతుంది. అక్కడి గిరిజనులు ఎంతో మనసుపెట్టి వండి.. పర్యాటకులకు ఈ డిష్ అందిస్తారు. అక్కడి చిక్కటి అటవీ ప్రాంతంలో.. ఈ వెచ్చటి చికెన్ తింటుంటే ఆ ఫీలింగ్ వేరు. ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చినవారు, పక్కాగా బొంగులో చికెన్ గురించి ప్రస్తావిస్తారు. అంతలా జనాల్ని ఫిదా చేసింది ఈ బొంగులో చికెన్. తాజాగా, ఇది వైజాగ్ సిటీలోనే ఈ స్పెషల్ డిష్ దొరకుతుండటంతో నాన్-వెజ్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది సూపర్ టేస్ట్ ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. నాన్‌వెజ్ లవర్స్.. బొంగులో చికెన్‌ను మీరు కూడా ఓసారి ఎంజాయ్ చేయండి.