Vizag: మిస్టరీగా మారిన పెళ్లి కూతురు సృజన మరణం.. ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు కాయ అవశేషాలు
పెళ్లి పీటలపైనే మృతి చెందిన సృజన కేసులో మిస్టరీ కొనసాగుతుంది. ఆమె ఎలా చనిపోయింది అన్న విషయంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పోలీసులకు ఓ లీడ్ దొరికింది.
పెళ్లి పీటలపైనే మృతి చెందిన సృజన మృతిపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సృజన హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు కాయ అవశేషాలు గుర్తించారు పోలీసులు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుల సమాచారంతో అనుమాన్నాస్పద మృతిగా కేసు నమోదు చేసారు. గురువారం ఉదయం కూడా సృజన అస్వస్థతకు గురైంది.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినట్టు తేలింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక మృతికి అసలు కారణం తెలుస్తుందన్నారు నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు. వధువు కుటుంబ సభ్యులతో పాటు.. వరుడి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. సృజన మృతిపై ఇరు కుటుంబాల పేరెంట్స్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. వాళ్ల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు కాయలు ఉండడంతో.. సృజన ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఇష్టపూర్వకంగానే పెళ్లి జరుగుతోందని పేరంట్స్ చేప్తున్నారు. మరి అలాంటప్పుడు చనిపోవాల్సిన అవసరం సృజనకు ఏంటనేదే ఇప్పుడు సస్పెన్స్. ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన పనుల్లోనూ చాలా ఉల్లాసంగా కనిపించారు. కానీ ఇలా పెళ్లి పీటల మీదకు రాగానే.. సడెన్‌గా ప్రాణాలు కోల్పోయింది సృజన.
అసలేం జరిగిందంటే…?
విశాఖలోని మధురవాడలో పెళ్లికూతురు సృజన మృతి.. తీవ్ర విషాదాన్ని నింపింది. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా ఆమె.. సృహ తప్పి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఈ ఘటన ఇరు కుటుంబాలను తీవ్ర షాక్‌కు గురిచేసింది. అందంగా ముస్తాబై పెళ్లిపీటలపై కూర్చున్న పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమెకు కళ్లుతిరిగి పడిపోయిందని అంతా భావించారు. ముఖంపై నీళ్లు చల్లినా ఆమె లేవలేదు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కాని అప్పటికే ఆ పెళ్లికూతురు ప్రాణాలు వదిలింది. పెళ్లి కూతురు శరీరంలో విషపదార్ధం గుర్తించినట్టు.. ఆమెను పరీక్షించిన డాక్టర్.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతికి ఫుడ్ పాయిజన్ కారణమా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. సృజనది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుల నివేదికతో మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు. తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెళ్లి రోజు ఉదయం కూడా పెళ్లి కూతురు సృజన ఆస్పత్రికి వెళ్లింది. నెలసరి రుతుక్రమంకి సంబందించిన సమస్య గా భావించి చికిత్స చేసి పంపారు. తాజాగా ఆమె శరీరంలో విషపదార్ధం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. పెళ్లి కూతురు సృజన మృతితో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పెళ్లికొడుకు శివాజీ తల్లి లలిత కూడా సృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఊహించని ఈ ఘటనను వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. వధూవరులు జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనే సంకేతంగా జీలకర్ర బెల్లం పెడతారు. ఆ జీలకర్ర బెల్లం పెడుతుండగానే వధువు ఒక్కసారిగా కుప్పకూలడం.. కొన్ని సెకన్లలోనే ప్రాణాలు కోల్పోవడం.. విశాఖలో అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఇద్దరి అంగీకారం తర్వాతే పెళ్లి నిశ్చయం చేసుకున్నట్టు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ దగ్గర నుంచి పెళ్లి తంతు వరకూ వధూవరులు ఇద్దరూ యాక్టివ్‌గానే ఉన్నారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సృజన పెళ్లి కోసం రెండు రోజుల క్రితమే విశాఖ వెళ్లింది. గ్రాండ్‌గా పెళ్లి తంతు జరుగుతున్న టైమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.