Maoist Martyrs’ Week – Andhra Odisha Border : రేపటి నుంచి (జూలై 28) జరుగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏవోబీ(ఆంధ్ర – ఒడిశా బోర్డర్)లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి అదనపు పోలీస్ బలగాలు.. విశాఖ ఏజెన్సీలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలీషియా హతమార్చే అవకాశముందని భావిస్తున్న పోలీస్ వర్గాలు.. ఆదిశగా అప్రమత్తపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల మాయమాటల్లో గిరిజనులు పడొద్దని పాడేరు ఎఎస్పీ జగదీష్ సూచిస్తూ.. పోలీసులిస్తున్న ఉపాధి శిక్షణను గిరియువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇలా ఉండగా, వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసులు మావోల కోసం జల్లెడపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మళ్లీ తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో మావోయిస్టులు తాసరపడి కాల్పులు ప్రారంభించినట్లు భద్రతా అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ పేర్కొన్నారు. కాగా.. మావోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
Read also : Assam – Mizoram : అసోం – మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఆరుగురు పోలీసులు మృతి