Sanchaita – Ashok Gajapathi Raju : “అశోక్ బాబాయ్ గారూ… మీ అన్న గారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపించారు.. ఆ ఈవో తన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడంలేదా?” అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాన్సాస్ ట్రస్టు మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతి. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదికి పంపారని సంచయిత విమర్శలు చేశారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వాడుకోవద్దు.. అని సంచయిత అన్నారు.
ఇలా ఉండగా, విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని నిన్న మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది చుట్టుముట్టి ఈవోను నిలదీసిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన జీతాలపై హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీనిపై సంచయిత పై విధంగా స్పందించారు. ఇలా ఉండగా, టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. మాన్సాస్ ట్రస్ట్ ముసుగులో ప్రభుత్వ భూములను అశోక్ గజపతి కుటుంబం సొంతం చేసుకుంటుందని ఆరోపించారు. అందులోని 200 ఎకరాల భూములను వైద్య కళాశాల కోసం ఇప్పటికే అమ్మేశారని విమర్శించారు. ఆ నిధులు ఏమయ్యాయో అశోక్ గజపతిరాజు చెప్పాలని బెల్లాన డిమాండ్ చేశారు. సుమారు మూడువేల ఎకరాల భూమిని అశోక్ కుటుంబం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉందన్నారు.
మాన్సాస్ ట్రస్టులో ప్రభుత్వ జోక్యం వలన అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబానికి తప్ప ప్రజలకు ఏమీ నష్టం లేదని ఎంపీ వ్యాఖ్యానించారు. “తమ భూములను కాపాడుకునేందుకే అప్పట్లో మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భయంతో అప్పట్లో ట్రస్టులో తమ ఆస్తులన్నింటినీ విలీనం చేశారు. ట్రస్టుకు చెందినవి కేవలం 8,851 ఎకరాల మాత్రమే. రిజిస్టర్లను తారు మారు చేసి 14,450 ఎకరాలుగా చూపిస్తున్నారు” అని బెల్లాన తీవ్ర ఆరోపణలు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్‌లో వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, అడ్వకేట్, డాక్టర్, వ్యాపార వేత్త సభ్యులుగా ఉండాలని ఎంపీ బెల్లాన డిమాండ్ చేశారు. కాని అశోక్ గజపతిరాజు హాయాంలో ఈ నిబంధనలేవీ పాటించలేదన్నారు. “ఆడిట్ కూడా జరపలేదు. అశోక్ వల్లే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. తమ సొంత ఆస్తులు అప్పట్లో ప్రభుత్వానికి లెక్కలు చూపారు. అవి కాకుండా ఏ ఆస్తులు ఉన్నా నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సిందే.” అని ఎంపీ చెప్పుకొచ్చారు.
Read also: Etela Rajender wife : హుజురాబాద్ ప్రచారంలో ఈటల జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు