ఏజెన్సీలో ప్రభుత్వ వైద్యం..అందుబాటులోకి ఆస్పత్రి

|

Sep 29, 2020 | 4:38 PM

దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న నార్నూర్‌-గాదిగూడ మండలాల ప్రజల కల నెరవేరింది. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న 30 పడకల సామాజిక ఆసుపత్రిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఏజెన్సీలో ప్రభుత్వ వైద్యం..అందుబాటులోకి ఆస్పత్రి
Follow us on

దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న నార్నూర్‌-గాదిగూడ మండలాల ప్రజల కల నెరవేరింది. ఐటిడీఏ పరిధిలోని నార్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఇన్నాళ్లుగా వైద్యం అందని ద్రాక్షగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్న నార్నూర్‌ ప్రజల కష్టాలను గమనించిన కేసీఆర్ ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రికి పచ్చజెండా ఊపింది. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న 30 పడకల సామాజిక ఆసుపత్రిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

30 పడకల సామాజిక ఆసుపత్రి తో పాటుగా కూరగాయల మార్కెట్‌ ను మంత్రి ఐకేరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఐకే రెడ్డి తో పాటు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన రాథోడ్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవ లక్మ్షి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ నార్నూర్‌ మార్కెట్‌ యార్డు నుంచి రైతులు చేపట్టిన ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ, ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చార‌న్నారు. ఇప్పటి వరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్‌ కోసం రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేద‌ని, ఇప్పుడు ఆ సమస్య ఉండద‌ని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగనున్నాయయ‌ని మంత్రి స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి స్థానిక రైతులు, మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.