AP Rains: ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఆంధ్రప్రదేశ్‌ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. గత కొన్నాళ్లుగా ఏపీని వరుసగా తుఫాన్లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాల కురిసే అవకాశముందని ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం తీరం వెంబడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అల్పపీడన్ ప్రభావంతో కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం హచ్చరించింది.
రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రానున్న 24 గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..