బీటెక్‌ బాబు హైటెక్‌ మోసం..విశాఖలో లిక్కర్‌ డాన్‌..గోవా మద్యం విశాఖకు.. ఆన్‌లైన్‌లో పేమెంట్‌.. బయటపడ్డ నయా దందా

|

Jun 29, 2021 | 11:32 PM

స్మార్ట్‌ సిటీగా ఎదుగుతున్న విశాఖలో నేరాలు కూడా రోజుకో రూపంలో బయటపడుతున్నాయి. కొత్తకొత్త నేరాలు పురుడుపోసుకుంటున్నాయి. ఇప్పటివరకు రౌడీషీటర్లు, వైట్‌ కాలర్‌ నేరాలు..

బీటెక్‌ బాబు హైటెక్‌ మోసం..విశాఖలో లిక్కర్‌ డాన్‌..గోవా మద్యం విశాఖకు.. ఆన్‌లైన్‌లో పేమెంట్‌.. బయటపడ్డ నయా దందా
Follow us on

స్మార్ట్‌ సిటీగా ఎదుగుతున్న విశాఖలో నేరాలు కూడా రోజుకో రూపంలో బయటపడుతున్నాయి. కొత్తకొత్త నేరాలు పురుడుపోసుకుంటున్నాయి. ఇప్పటివరకు రౌడీషీటర్లు, వైట్‌ కాలర్‌ నేరాలు వెలుగులోకి వస్తే.. ఇప్పుడు ఏకంగా ఓ యువకుడు లిక్కర్‌ డాన్‌గా మారిపోయాడు. గోవా నుంచి మద్యాన్ని మూడో కంటికి తెలియకుండా దిగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.

మధురానగర్‌కు చెందిన శరత్‌బాబు చదివింది బీటెక్‌. కానీ వీడి తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. ఏమైందో ఏమో కానీ మధ్యలో చదువు ఆపేసి.. ఉద్యోగ వేటలో పడ్డాడు. వీడి టాలెంట్‌తో కొన్ని సంస్థల్లో హెచ్‌ఆర్‌ గానూ, మరొకొన్ని చోట్ల ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గానూ పని చేశాడు. ఈ లోగా గోవాలో లిక్కర్‌ను తరలించే బల్క్‌ సప్లయర్స్‌తో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఇక అంతే..! వెనుదిరిగి చూడలేదు. ఆ బల్క్‌ సప్లయర్స్‌ గ్రూప్‌లో చేరిన శరత్‌.. ఒకచోట్ల నుంచి మరోచోటికి లిక్కర్‌ను తరలించి కొన్ని లాభాలు ఆర్జించేవాడు. ఇలా రెండు నెలల పాటు వారి కార్యకలాపాలపై కన్నేశాడు. ఓ రోజు ఇతనికి ఓ ఐడియా తట్టింది. కమిషన్‌ ప్రాతిపదికన వారిదగ్గర తానెందుకు పనిచేయాలని అని అనుకున్నాడు. ఏకంగా తానే ట్రాన్స్‌పోర్టర్‌గా మారిపోయాడు.

ఇక.. మార్చి నుంచి ఆపరేషన్ మొదలుపెట్టేశాడు. మూడో కంటికి తెలిస్తే.. లోగుట్టు బయటపడిపోతుందని అతనే స్వయంగా అన్నీ చక్కబెట్టుకున్నాడు. ఇక గోవానుంచి లిక్కర్‌ ను విశాఖకు తరలించేంది ఎలా..? దీనిపై వర్కవుట్‌ చేసిన ఈ లిక్కర్‌ డాన్‌ శరత్‌..! రీప్లేస్‌మెంట్‌ గూడ్స్‌ తరలిస్తున్నట్టు బాక్సులు పంపించి అందులో లిక్కర్‌ను తీసుకురావాలని అనుకున్నాడు. విజయనగరం వెళ్ళి అక్కడ ఓ కార్పెంటర్‌ సాయంతో చక్కపెట్టెలు తయారు చేయించాడు. ఆ పెట్టెల్లో కొన్ని పనికిరాని సామాన్లు, వస్తువులు పెట్టి గోవాకు ట్రాన్స్‌పోర్ట్‌ బుక్‌ చేసేవాడు. కన్సైన్‌మెంట్‌లో మాత్రం ఎలక్ట్రికల్‌ రీప్లేస్‌మెంట్‌ అని రాయించేవాడు.

ఇలా ఒకే ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపితే ఎక్కడైనా తెలిసిపోతుందేమో అని.. మల్టిపుల్‌ ట్రాన్స్‌ పోర్టర్‌ను ఎంచుకునేవాడు. విడతల వారీగా పార్సిల్స్‌ చేరవేసేలా ఆయా కార్యకలాపాలు నిర్వర్తించే కన్సల్టెన్సీలకు ఆ బాధ్యతలను అప్పగించే వాడు. విశాఖ నుంచి విజయవాడ.. అక్కడనుంచి హైదారాబాద్‌, హైదరాబాద్‌ టు పూణె. అక్కడి నుంచి గోవా.. ఇలా తాను అనుకున్న చిరునామాకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ పార్సిల్స్‌ అక్కడకు చేరేలోగా ట్రాకింగ్‌ను పెట్టుకుని తాను విమానంలో గోవా వెళ్ళిపోయేవాడు. వాటిని తానే రిసీవ్ చేసేకుని వాటిని ఖాళీ చేసేవాడు. తిరిగి అదే పెట్టెల్లో గోవా లిక్కర్‌ను వేసి పార్సిల్‌ చేసి.. మళ్ళీ వెనక్కి పంపేవాడు. అప్పుడు కూడా సేమ్‌.. మల్టిపుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టంనే ఎంచుకునేవాడు ఈ లిక్కర్‌ డాన్‌ శరత్‌. ఇలా ఒక్కో చక్కపెట్టెలో 20 కేసులు మద్యం పట్టేలా ప్లాన్‌ చేసుకుని హ్యాపీగా మూడో కంటికి తెలియకుండా గోవా లిక్కర్‌ను విశాఖకు డంప్‌ చేసేవాడు.

ఆ లిక్కర్‌తో కూడుకున్న పార్సిల్స్‌ విశాఖకు చేరుకునేలోగా మళ్ళీ గోవా టు విశాఖ ఫ్లైట్‌లో వైజాగ్‌లో వాలిపోయేవాడు శరత్‌. గోవా మద్యాన్ని అక్రమంగా విశాఖ వరకు తెచ్చేందుకు ఎంత జాగ్రత్త పడ్డాడో.. వాటిని ఇక్కడ అమ్మేందుకు కూడా తన మాస్టర్‌ మైండ్‌కు మరింత పదును పెట్టాడు. గోవాలో ఎలాగైతే బల్క్‌ సప్లయర్స్‌ గ్రూప్ ఉందో అదే ఫార్ములాకు పదునుపెట్టాడు శరత్‌. కానీ.. ఇక్కడ ఓ యాభై మందిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అత్యంత గోప్యమైన తన గ్రూప్‌ ఆఫ్‌ నెట్‌ వర్క్‌తో గోవా నుంచి తెచ్చిన మద్యాన్ని ఈజీగా అత్యంత వేగంగా సరఫరా చేసేవాడు. అడిగిన వాడికి అడిగినట్టు సీక్రెట్‌గా వారితో పంపేవాడు ఈ లిక్కర్‌ డాన్‌.

జూన్‌ 21 నాటికి 100 ప్యాక్‌లు స్టాక్‌ ఉంటే.. అయిదు రోజుల వ్యవధిలో వాటిలో కేవలం 70కి పైగా ప్యాక్లను అమ్మేశాడు శరత్‌. ఇలా బాటిల్‌ మద్యాన్ని గోవాలో రూ.300 కొనుగోలు చేసి వాటిని విశాఖలో 1400 రూపాయలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడు. గోవా లిక్కర్‌ ను అక్రమంగా దిగుమతి చేసుకుని ఏపీలో అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఇలా గత ఆరు నెలలుగా శరత్‌ వ్యాపారం మూడు కార్టూన్లు.. ఆరు లిక్కర్‌ బాటిళ్ళుగా సాగిపోతోంది. దీంతో చిన్నపాటి సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు.. కూపీ లాగేసరికి ఈ లిక్కర్‌ డాన్ నెట్‌ వర్క్‌ అంతా బయటపడింది. ఎట్టకేలకు పూర్తి ఆధారాలతో శరత్‌ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్‌ అధికారులు.. అతనితో పాటు విశాఖలో లిక్కర్‌ అమ్మేందుకు సహకరిస్తున్న విశాఖ షేక్‌ లను అరెస్ట్‌ చేశారు. 294 రాయల్‌స్టాగ్‌, 1860 బోంబే విస్కీ, మాన్షన్‌ హౌస్‌ ఫుల్‌ బాటిళ్లను సీజ్‌ చేశారు అధికారులు. వాటి విలువ ఏపీ ఎక్సైజ్‌ ప్రకారం దాదాపు 7 లక్షల వరకు ఉంటుందని అంచనా.

నిజంగా తనకున్న మాస్టర్‌మైండ్‌ను మంచి పనులకు వినియోగిస్తే.. జీవితంలో ఉన్నతంగా ఎదిగేవాడు.. కానీ.. ఇప్పుడు జైలు పాలు కాకతప్పలేదు. శరత్‌ పెంచిపోషిస్తున్న ఈ నెట్‌వర్క్‌ సిస్టంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. మిగిలిన వారినీ ట్రాక్‌ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.

ఇవీ కూడా చదవండి:

Bank Deposits: ఓ కుబుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?

Lady Ayurveda doctor : హైదరాబాద్ ఆయుర్వేద డాక్టరమ్మని ట్రాప్ చేసి 41లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్