Vizag: విశాఖ ప్రజలకు అలెర్ట్… మోసగాళ్ల కళ్లన్నీ మీ నగరంపైనే

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి విశాఖ విలవిలలాడుతుంది. కాదేది మోసానికి అనర్హం అన్నట్టు సైబర్‌ కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులన్న తేడా లేకుండా అందరినీ ముంచేస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు.

Vizag: విశాఖ ప్రజలకు అలెర్ట్... మోసగాళ్ల కళ్లన్నీ మీ నగరంపైనే
Vizag
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 19, 2024 | 9:08 AM

సైబర్‌ నేరగాళ్లకు విశాఖ ఒక ప్రయోగశాలగా మారింది. వారు చేసే అన్నిరకాల మోసాలను వైజాగ్‌ వాసులపైనే ప్రయోగిస్తున్నారు. తెలిసీతెలియక చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హనీట్రాప్‌ కేసు విశాఖను కుదిపేస్తుంది. జమీనాను అడ్డుపెట్టుకుని పెద్దగ్యాంగ్ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ప్రీప్లాన్డ్‌గా ట్రాప్‌ చేసి డబ్బు దోచేశారన్నారు.

విశాఖలో కాల్‌ సెంటర్ ఓపెన్‌ చేసిన చైనీస్‌ ముఠా

విశాఖలో కోట్లకు కోట్లు ఈజీ మనీ వస్తుంటే చైనా నుంచి పనిచేయడం ఏంటి అనుకున్నారో ఏమో.. ఏకంగా ఇక్కడే ఓ కాల్‌ సెంటర్‌నే తెరిచింది సైబర్ ముఠా. విశాఖ కేంద్రంగా స్టాక్ మార్కెటింగ్, ఫెడెక్స్, ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడింది. సీ స్మైల్ అపార్ట్‌మెంట్‌లో దాడులు చేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్‌లైన్‌ మెసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా కాయ్‌ రాజా కాయ్‌ అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడి డబ్బును చైనా, తైవాన్‌కు చేరవేసినట్టు గుర్తించారు పోలీసులు.

మరోవైపు డిజిటల్ అరెస్టుల పేరుతో వైద్యులు, ఉన్నత చదువులు చదువుకున్నవారి దగ్గరి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. విశాఖపట్నంలో నమోదవుతున్న కేసులు అందరినీ భయపెడుతున్నాయి. మహిళలు, యువతులే టార్గెట్‌గా చేసుకుని తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన మెసేజ్‌లు హడలెత్తిస్తున్నాయి. ఏ సమయంలో ఎవరి వంతు వస్తుందేమోనని మహిళలు, యువతులు భయపడిపోతున్నారు. వర్కింగ్ ఉమెన్లు, కంపెనీల్లో పనిచేసే మహిళలు, యువతులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్‌ ఐడీలతో వేధింపులకు గురిచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో మోసం

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్నవారే కాదు జీవితాలు పోగొట్టుకున్నవారిలోనూ విశాఖ వాసులే అధికం. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో తెలుగువారిని కాంబోడియాకు తీసుకెళ్లి ఆన్‌లైన్‌ మోసాలు చేసేలా ట్రైనింగ్ ఇచ్చింది సైబర్‌ ముఠా. మోసాలకు పాల్పడనందుకు తెలుగు యువకులను చిత్రహింసలకు గురిచేసింది. కొద్ది రోజుల క్రితమే విశాఖ పోలీసులు ఈ ముఠా చేతుల్లో చిక్కిన 58 మందిని రక్షించారు.

సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

సైబర్ నేరాలపై వైజాగ్‌ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్నాక కొంతమేర సైబర్ క్రిమినల్స్‌ ఆటకట్టిస్తున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు సీపీ . ఇప్పటి వరకు ఎలాంటి సైబర్‌ క్రైంలు జరిగాయి? ఎన్ని విధాలుగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్నారు. డాక్యుమెంటరీ పూర్తయ్యాక థియేటర్లు, బస్టాండ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రదర్శిస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..