Visakhapatnam Murder : కుటుంబంలో జరిగే చిన్న చిన్న కారణాలకే అన్నదమ్ములు విరోధులుగా మారుతున్నారు. రక్త సంబంధం మరిచి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆఖరుకు కన్న తల్లిదండ్రులను అనాథలుగా చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన జరిగింది.పెళ్లి సంబంధానికి వెళ్లిన దగ్గర అమ్మాయి పెద్దోడు వద్దు చిన్నోడిని చేసుకుంటా అనడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అచ్యుతాపురం మండలం జాలరిపాలెనికి చెందిన మడ్డు పోలమ్మ పెద్ద కుమారుడు రాజుకు పెళ్లి చేయడానికి ఇటీవల భీమిలికి చెందిన అమ్మాయిని చూశారు. కానీ ఆ అమ్మాయి పోలమ్మ చిన్న కుమారుడు యర్లయ్య(21)ను చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు మరో సంబంధం చూస్తానని నచ్చచెప్పింది. మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో రాజు అసహనానికి గురయ్యాడు.
సోమవారం యర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులడిగాడు. ఆమె రూ.2 వేలు ఇవ్వగా.. అవి సరిపోవని రూ.4వేలు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇదే సరైన సమయమని భావించిన రాజు యర్లయ్యను అడ్డుకొని పక్కన ఉన్న కత్తిని అమాంతం తమ్ముడి గొంతులో దించాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తనను కాదన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నందుకే చంపానని పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.