విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. మృతురాలిని గురువెల్లి శ్వేత (24)గా పోలీసుల దర్యాప్తులో తేలింది. మరణానికి కొన్ని గంటల ముందే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న బీచ్‌లో మృతదేహం ఇసుకలో కూరుకుపోవడం, శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉండటంతో తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి.
శ్వేత కుటుంబీకుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మూలపేట. తండ్రి చనిపోవడంతో తల్లి రమ విశాఖ రైల్వే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువిల్లి మణికంఠతో వివాహం జరిపించారు. ప్రస్తుతం శ్వేత ఐదు నెలల గర్భిణి. 15 రోజుల క్రితం ఆఫీస్ పనిపై భర్త మణికంఠ హైదరాబాద్ వెళ్లారు. అత్తమామలతో కలిసి ఉంటున్న శ్వేత మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అత్తమామలు ఆసుపత్రి పనిమీద బయటకు వెళ్లారు. అనంతరం శ్వేత తన భర్త మణికంఠతో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఫోన్ ఆపేసి ఇంటికి తాళాలు వేసి పక్కింట్లో అందజేసి రాత్రి 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అత్తమామలు శ్వేత పక్కింట్లో ఇచ్చిన తాళాలు తీసుకుని ఇంటి తలుపులు తీశారు. ఇంట్లో శ్వేత తన భర్తనుద్దేశించి రాసిన లేఖ కనిపించింది. కోడలు ఇంటికి రాకపోవడంతో అత్తమామలు న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో 12 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు గంటలకే ఆర్కే బీచ్ ఇసుకలో ఓ యువతి మృతదేహం కూరుకుపోయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం శ్వేతదే అని గుర్తించారు.
శ్వేత తల్లి కీలక ఆరోపణలు
అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని, రూ.10 లక్షల కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించినట్లు మృతురాలి తల్లి రమ ఆరోపణలు చేశారు. 5 నెలల గర్భిణీ అయిన తన కూతురిని కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని, భర్త అత్తమామల టార్చర్ భరించలేక ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీటి పర్యాంతమయ్యారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
శ్వేత అత్తింట్లో ఉంచిన సూసైడ్ లేఖలో ‘చిట్టీ…నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం బాధ ఉండదని. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అంటూ స్మైలీ బొమ్మ వేసిన ఆ లేఖను శ్వేత గదిలో పోలీసులు గుర్తించారు.
శ్వేత భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్‌లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.