విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి: మంత్రి నారా లోకేశ్..

ఐటీ కంపెనీలకు విశాక డెస్టినేషన్ సిటీ అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50శాతం విశాఖకే వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. విశాఖ కేంద్రంగా 4 జిల్లాలతో ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.. ఏపీ బులెట్ ట్రైన్‌లా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.

విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి: మంత్రి నారా లోకేశ్..
Nara Lokesh

Updated on: Oct 12, 2025 | 9:31 PM

విశాఖపట్నం.. ఏపీ ఆర్థిక రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2047 నాటికి విశాఖ ఆదాయం 1 ట్రిలియన్ డాలర్‌కు చేరుతుందని చెప్పారు. సిఫీ ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండ్ స్టేషన్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, స్థానిక నేతలు, సిఫీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. పెట్టుబడులు విషయంలో ఇతర రాష్ట్రాలతో కాదు.. ఇతర దేశాలతో ఏపీ పోటీ పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50శాతం విశాఖకి వస్తున్నాయని చెప్పారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ లాంటి టెక్ దిగ్గజాలన్నీ విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటితో 5 లక్షల ఐటి ఉద్యోగాలు విశాఖలో కల్పిస్తామని లోకేష్ వివరించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.. ఏపీ బుల్లెట్ ట్రైన్‌లా అభివృద్ధిలో దూసుకుపోతుందని నారా లోకేష్ చెప్పారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని, 14వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చామన్నారు.

కొద్ది నెలల్లోనే అనేక సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమే అన్న లోకేష్. కంపెనీలు తీసుకు రావడమే కాదు.. అన్ని విధాలా ఆర్థిక వృద్ధి సాధిస్తామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..