Visakha Politics: విశాఖలో మంత్రివర్గ విస్తరణ తెచ్చిన తంటా.. అమర్‌-అవంతి మధ్య భగ్గుమన్న వర్గ విబేధాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు చల్లారాక ముందే విశాఖ జిల్లాల్లో తాజా, మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తిగా మారింది.

Visakha Politics: విశాఖలో మంత్రివర్గ విస్తరణ తెచ్చిన తంటా.. అమర్‌-అవంతి మధ్య భగ్గుమన్న వర్గ విబేధాలు
Gudivada Amarnath Avanti Srinivas
Follow us

|

Updated on: Apr 16, 2022 | 4:27 PM

Visakha Politics: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు చల్లారాక ముందే విశాఖ జిల్లాల్లో తాజా, మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తిగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్(Avanti Srinivas) తాజా గా తనను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అయితే కొత్త మంత్రికి తనదైన నిరసన తెలుపుతుండడం మరో ఆసక్తికరమైన అంశం గా మారింది. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విశాఖ కు వచ్చిన గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath)కి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నేతలు అందరూ వచ్చినా భీమిలి నుంచి మాత్రం ఎవ్వరూ హాజరుకాలేదు. దీనిపై ఆరా తీసింది అమర్ వర్గం. తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వద్దని చెప్పి స్వయంగా కార్పొరేటర్లతో పాటు, ముఖ్య నేతలకు చెప్పినట్టు తెలిసింది. ఏకంగా అవంతినే ఫోన్ చేసి ఎవరూ వెళ్ళొద్దని చెప్పడం, మంత్రిగా అమర్ తొలిసారిగా విశాఖ వచ్చి మూడు రోజులు అయినా ఇద్దరూ కలవకపోవడంపై విశాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుత కేబినెట్‌లో 11 మంది తాజా మాజీలకు తిరిగి అవకాశం కల్పించారు. అయితే తనను విస్మరించడం పట్ల అవంతి శ్రీనివాస్ రగిలిపోతున్నారు. బయటపడకపోయినా తిరిగి కేబినెట్‌లోకి తీసుకున్న 11 మందితో పోలిస్తే తనకేం తక్కువ అన్నది అవంతి ఫీలింగ్. తాను వర్గాలను కట్టలేదని, అవినీతికి పాల్పడలేదని, పార్టీకి లాయల్ గా ఉంటే తనను విస్మరించడం ఒక బాదైతే, గుడివాడ అమర్ కి ఇవ్వడాన్ని అసలు సహించలేకపోతున్నారు అవంతి. వీళ్లిద్దరూ గతంలో కూడా బయటకు బాబాయ్ – అబ్బాయ్‌లా బాగానే ఉన్నట్టు కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఒక రేంజ్ లో సాగేది.

విశాఖ లో కాపు సామాజిక వర్గం నుంచి తననే పరిశీలించాలన్నది అవంతి అభిప్రాయం. పార్టీ అమర్ కి ప్రాధాన్యం ఇవ్వడాన్ని అవంతి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఈ నేపథ్యంలో అవంతి కి పదవి తీసేసి అమర్ కి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది అవంతి వర్గం. ఈ నేపధ్యంలోనే అమర్ కి ఆహ్వానం పలికేందుకు తన కార్పొరేటర్లను వెళ్ళొద్దని స్వయంగా చెప్పడం కూడా అందులో భాగమే. అంతే కాదు అమర్ ది అనకాపల్లి జిల్లా. కాబట్టి, అక్కడకి మాత్రమే పరిమితం కావాలని, అలా కాకుండా విశాఖ జిల్లాలో వేలుపెడితే సహించేది లేదన్నది అవంతి వర్గం తెగేసీ చెబుతోంది. తాను గతంలోనూ అనకాపల్లి నియోజకవర్గంలో వేలు బెట్టలేదని, ఇప్పుడు కూడా అలా కాకుండా విశాఖ జిల్లాలో అమర్ వేలుపెడితే రచ్చ చేయాలన్న ఆలోచన కూడా అవంతి వర్గం చేస్తున్నట్టు సమాచారం

ఇక అమర్ వర్గం వాదన మరోలా ఉంది. అమర్ ఎప్పుడూ అవంతి ని విభేదించలేదని, అసలు అమర్ విద్యాబ్యాసం చేసింది అవంతి ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిస్ట్యూషన్స్‌లో అని, 2014 లో అనకాపల్లి పార్లమెంట్ కి అమర్ పోటీ చేసిన సందర్భంలో కూడా గురువు అవంతికి పాదాభివందనం చేసే నామినేషన్ వేశారు. ఆ ఎన్నికలలో అమర్ పై అవంతి విజయం సాధించాక అసలు అమర్ పట్ల చులకన భావంగా ఉండేవాడన్నది అమర్ వర్గం వాదన. కాపు సామాజిక వర్గంలో మరో నేత ఎదగకూడదని, అలా ఉంటే తన నాయకత్వానికి సవాల్ ఎదురవుతుందన్న రీతిలో అవంతి చర్యలు ఉంటాయని అందుకే అమర్ తో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నేతలను అవంతి ఇబ్బందులు పెట్టారని అమర్ వర్గం చెబుతోంది. మంత్రి పదవి వచ్చిన తర్వాత అమర్ స్వయంగా ఫోన్ చేసి అవంతి కి చెప్పారని, అయినా ముభావంగా మాట్లాడి పెట్టేసారని అమర్ వర్గం చెబుతోంది. మంత్రి వర్గంలో స్తానం దక్కలేదని అసంతృప్తి ఉన్నా కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి లు తోపాటు అందరూ ఎయిర్పోర్ట్ కి వచ్చినా, తర్వాత కూడా అందరూ బానే ఉన్నా అవంతి మాత్రం పలకరించకపోవడం పట్ల అమర్ వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది.

— ఈశ్వర్, టీవీ 9 ప్రతినిధి, విశాఖ జిల్లా.

Read Also….  Viral Video: చైనాలో కరోనా నిబంధనల పేరుతో క్రూరత్వం! ఐసోలేషన్ యూనిట్ల కోసం ఇళ్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు