
ఏపీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. తీవ్రమైన చలితో పాటు పొగమంచు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక రోడ్లను మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కనిపించక, ఎదుట వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతికి సొంతూరు వెళ్లి తిరిగి వచ్చేవారు పొగమంచుతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 దాటినా చలి, పొగమంచు అలాగే ఉంటుంది. 10 గంటల తర్వాత కొంచెం పొగమంచు తగ్గుతుంది. దీంతో ఉదయం వేళల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది. చలి, పొగమంచుపై విశాఖ వాతావరణశాఖ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఏపీలోని పలు జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం ఫాగ్ హెచ్చరిక జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల్లో పలుచోట్ల ఘనమైన పొగమంచు కురిసే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉదయం వేళ రహదారులపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గే ఛాన్స్ ఉందని, వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది. ఫాగ్ లైట్లు వినియోగించి నెమ్మదిగా డ్రైవ్ చేయాలని IMD హెచ్చరించింది. ఉదయం 7:43 గంటల వరకు అలర్ట్ అమల్లో ఉండే అవకాశముందని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పొగమంచు ఎక్కువ ఉండే అవకాశముందని తెలిపింది. మరికొన్ని రోజుల పాటు దట్టమైన పొగమంచు కొనసాగుతుందని, ప్రజలు ఉదయం వేళల్లో బయటకు రావొద్దని సూచించింది. అత్యవసరమై బయటకు వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
ఏపీవ్యాప్తంగా చలిపులి చంపేస్తోంది. రాత్రి, ఉదయం వేళల్లో కాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా చలి కొనసాగుతోంది. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు స్పెట్టర్లు, మఫ్టీలు ఉపయోగిస్తున్నారు. ఈ నెల పాటు చలి తీవ్రత తారాస్థాయిలో ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేస్తోంది. చలి కారణంగా ప్రజలు రాత్రి, ఉదయం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఈ సమయాల్లో ఇంట్లోనే తలదాచుకుంటున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది చలి ఎక్కువగా ఉందని ప్రజలు అంటున్నారు. చలి వల్ల వృద్దులు, పిల్లలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వృద్దులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ చెబుతోంది.