Student drowned to death at RK Beach: హ్యాపీగా గడుపుదామని.. ఎక్కణ్నుంచో వచ్చారు. అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలే కోల్పోయారు. విహారం కోసం వచ్చినవారు.. నీట మునిగి తనువులు చాలించారు. విశాఖ బీచ్‌లో జరిగిన ప్రమాదం… అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విశాఖ బీచ్‌లో కెమెరాకు చిక్కిన దృశ్యాలు హృదయ విదారకరంగా కనిపించాయి. ముంచేస్తున్న అలలలను తట్టుకోలేక.. కూతవేటు దూరంలో కళ్లముందే ఓ వ్యక్తి మునిగిపోయాడు. విషాద ఘటన విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో చోటుచేసుకుంది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది లైఫ్ గార్డ్స్‌తో కష్టపడి పైకి తీసుకొచ్చినవారిలోనూ అదే పరిస్థితి. అప్పటికే పొట్టలోకి నీరు చేరడంతో.. ప్రాణాలు కోల్పోయారు. ఇది మరీ విషాదం. విశాఖ బీచ్‌లో యువకులు గల్లంతయిన ఘటనలో.. బాధాకర దృశ్యాలు ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. అమాంతం పైకొస్తున్న అలల్ని చూస్తే.. పై ప్రాణం పైనే వెళ్లిపోతుంది. అలాంటి, అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న మనిషిని లైవ్‌లో చూస్తే.. ఎలా ఉంటుంది? అక్కడున్న వారికి అలాంటి భయానక అనుభూతే కలిగింది.
ఆనందంగా గడిపేందుకు వచ్చివారికి.. ఆయుర్దాయం తీరిపోయింది. సికింద్రాబాద్‌కు చెందిన 8మంది యువకులు.. మధ్యాహ్నం ఆర్కే బీచ్‌కు చేరుకుని స్నానం కోసం సముద్రంలోకి వెళ్లారు. పెద్ద కెరటం దూసుకురావడంతో.. అందులో ముగ్గురు నీట మునిగారు. కొన ఊపిరితో ఉన్న శివ అనే యువకుణ్ని లైఫ్ గార్డ్స్‌తో పైకి తీసుకొచ్చినా.. ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పొట్టలో నీరు చేరడంతో.. మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీచ్ లో ఆదివారం గల్లంతైన మరో యువకుడు మహమ్మద్ అజీజ్ మృతదేహం కూడా లభ్యమైంది. శివ మృతదేహం లభ్యమైన కొన్ని గంటలకే RK బీచ్ సమీపంలోనే అజీజ్ మృతదేహన్ని కోస్టల్ గార్డ్స్ సిబ్బంది గుర్తించింది.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని KGHకి తరలించారు పోలీసులు. ఆదివారం సముద్రంలో స్నానానికి దిగిన ఒరిస్సా వాసి సుమిత్రా తృపాఠి, హైదరాబాద్ వాసులు Ch.శివ, కోట శివ, అజీజ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, విహారం కోసం వచ్చిన ఒడిశా విద్యార్థులూ… ఈ అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. భద్రక్ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు… పిక్నిక్ కోసం ఆర్కే బీచ్‌కు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. పెద్ద కెరటం ఎగిసిపడింది. దీంతో, ఓ విద్యార్థి గల్లంతై.. కొద్ది సేపటికే శవమై ఒడ్డుకు చేరింది. మిగిలిన నలుగురూ క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతయిన వారికోసం గజ ఈతగాళ్లతో, స్పీడ్ బోట్ల సాయంతో గాలింపు చేపట్టారు.
రిప్ కరెంట్ అంటే ఏమిటి?
ఇదిలావుంటే, ఒక న్యూ ఇయర్ వేడుక. నలుగురి ప్రాణాలు బలి. అంతులేని అధికారుల నిర్లక్ష్యం. తీవ్రమైన బాధితుల నిర్వేదం. ఒక పోలీస్ హెచ్చరికతో సరి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే చందంగా మారుతోంది. విషాదకరం ఏంటంటే కొట్టొచ్చినట్టు కనిపించే అధికారుల నిర్లక్ష్యం. పర్యాటకానికి సంబంధించి ఇక్కడొక మంత్రి ఉండి కూడా పాటించని కనీస ప్రమాణాలు. ఇదీ ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఆటు- పోట్ల విషయం అలా ఉంచితే.. ఇదే దుర్ఘటన సందర్భంగా.. మనకో మాట పదే పదే వినిపిస్తోంది.. అది ఏంటంటే.. రిప్ కరెంట్.. వాటీజ్ రిప్ కరెంట్.. అంటే.. తీరం దిశగా వచ్చే కెరటంలో మధ్య భాగం తిరిగి వెనక్కి వెళ్లే సమయంలో ఏర్పడే తీవ్రతను రిప్ కరెంట్ అంటారు.
కెరటం మధ్య భాగంలో వుండే ఈదాడే వ్యక్తి రిప్ తీవ్రతకు గురై కెరటంతోపాటు లోనికి వెళ్లిపోతారు. ఈటైంలో ప్రమాదం నుంచి బయట పడాలంటే…వెనక్కి వెళ్లే కెరటంతోపాటు నిటారుగా ఈదకూడదు. దీనికి బదులు కుడి, లేదా ఎడమ వైపునకు ఈదేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సురక్షితంగా బయటపడతారు. లేకపోతే కెరటం వెనక్కి వెళ్లే క్రమంలో దాంతోపాటు లోనికి వెళ్లిపోతారు. ప్రస్తుతం ఇదే జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం 900 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరం గల ఏపీకి సీ- మేనేజ్మెంట్, మెజర్మెంట్ పక్కాగా తెలిసి ఉండాలి. ఇక్కడి అధికారగణానికి సీ- బిహేవియర్ ఏంటో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. కానీ ఇక్కడేం జరుగుతోంది? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఇప్పటి వరకూ విశాఖ బీచ్ లో సంభవించిన మరణాలను ఒక సారి చూస్తే 2018 లో 55, 2019 లో 51, 2020 లో 64, 2021 లో 63గా రికార్డులు చెబుతున్నాయి. బీచ్ పోలీస్ స్టేషన్ అన్నది కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటివరకు కార్యరూపం దాల్చక పోవడం ఒక విషాదం. ఒక్క ఔట్ పోస్ట్ మాత్రమే ఉంది. అక్కడా పరిమితమైన సిబ్బంది మాత్రమే ఉండటం మరో దౌర్భాగ్యం. మాములుగా అయితే మూడు అంచెల పోలీసింగ్ ఉంటుంది. ఒకటి స్టాండ్ పోలీస్. రెండు రోడ్ పోలీస్. మూడు రూఫ్ టాప్ పోలీస్.
వీళ్లంతా చెప్పుకోడానికి మాత్రమే. ఈ మూడింట్లో ఒక్కో ప్రాంతానికి కేవలం నలుగురు మాత్రమే ఉంటారు. వీకెండ్ లో పదివేల మంది వరకూ బీచ్ కి వస్తారు. పర్యాటకులను నియంత్రించేందుకు ఈ స్టాఫ్ సరిపోరు. 12 మంది పోలీసులకు తోడు..18 మంది గజ ఈతగాళ్లు లైఫ్ గార్డ్స్ పేరిట ఉంటారు. కానీ వీళ్లకు లైఫ్ జాకెట్లే ఉండవు. కనీసం స్ట్రెచర్ గానీ ఎమర్జెన్సీ కిట్ కానీ ఉండదు. ఈ లైఫ్ గార్డులకు 9 నెలలుగా జీవీఎంసీ జీతాలే ఇవ్వక పోవడం కొసమెరుపు. హెచ్చరికలతో కూడిన బోర్డులుండాలి. కానీ అలాంటివేవీ ఇక్కడ కనిపించక పోవడం అతి పెద్ద తప్పిదం. అధికారుల నిర్లక్ష్యం.. పర్యాటకుల కుటుంబాల్లో అంతు లేని విషాదం.. ఇదీ విశాఖ తీరాన దుస్థితి.