తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ స్వర్ణలత.. మరో కేసులోనూ హస్తం.. సబ్‌ రిజిస్ట్రార్‌‌ను బెదిరించి..

విశాఖపట్నం మధురవాడలో సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ కేసులో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కేసులో సుధాకర్‌కు సహకరించిన వ్యక్తిగా గతంలో వివాదాస్పద ఘటనల్లో పాల్గొన్న మాజీ ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత పేరు వెలుగులోకి వచ్చింది.

తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ స్వర్ణలత.. మరో కేసులోనూ హస్తం.. సబ్‌ రిజిస్ట్రార్‌‌ను బెదిరించి..
Ci Swarnalatha

Edited By: Shaik Madar Saheb

Updated on: May 08, 2025 | 11:08 AM

సస్పెండై జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు..! అక్రమాల్లో ఆరితేరిన లేడీ పోలీస్‌ స్వర్ణలతకు సినిమా పిచ్చి ఇంకా పోలేదు…! గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టై రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వ్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ స్వర్ణలత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖపట్నం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్‌ కాల్‌ లిస్ట్‌ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

గతంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్టయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత నకిలీ దందా వ్యవహారం బయటపడటం.. అరెస్టవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్‌ ఉన్నా స్వర్ణలత.. మళ్లీ దందాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఆమెకి ఇంకా సినిమా పిచ్చి పోలేదని చెబుతున్నారు. బాపట్ల సహా చుట్టు పక్క ప్రాంతాల్లో స్వర్ణలత కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ప్రస్తుతం స్వర్ణలత బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు, పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలను, నైతిక విలువల పతనాన్ని చూపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..