Visakhapatnam Police: ఒక్క క్షణం.. ఆ ఒక్కక్షణం ఆలస్యమైనా, పోలీసులు కాస్త నిర్లక్ష్యం చేసినా ఓ నిండుప్రాణం గాల్లో కలిసిపోయేది..! సమాచారం అందిన క్షణాల్లోనే అలర్టైన పోలీసులు.. లొకేషన్ ట్రాక్ చేసి ఓ హోటల్‌కు వెళ్ళారు. అక్కడ గదిలో లోపలనుంచి తాళం వేసుకుని అప్పటికే ఆ వ్యక్తి విషాన్ని మింగాడు. సకాలంలో పోలీసులు చేరుకుని అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ వ్యక్తి సేఫ్‌గా ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. పోలీసుల పనితీరుకు శభాష్ చెబుతున్నారు ప్రజలు.
వివరాల్లోకెళితే.. విజయనగరం కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చైతన్య వర్మకు ఏమైందో ఏమో కానీ.. తీవ్ర మనస్తాపాని గురయ్యాడు. విశాఖకు వచ్చి ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్‌లో దిగాడు. కట్ చేస్తే.. అనకాపల్లి పోలీసులకు ఓ ఫోన్ కాల్..! తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడని ఫోన్. అతని వద్ద సెల్‌ఫోన్ కూడా ఉందని సమాచారమిచ్చాడు. అలాగే ఫోటోకూడా షేర్ చేశాడు. అంతే.. అనకాపల్లి పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి.. అతగాడు ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్ ఏరియాలో ఉన్నట్టు తెలుసుకుని.. త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా సమయం గడిచిపోతే ప్రాణాలు పోతాయేమోనని పోలీసుల్లో టెన్షన్.
ఇక.. అనకాపల్లి పీఎస్ నుంచి సమాచారం అందుకోగానే అలర్ట్ అయిన ఎస్సై రాము నేతృత్వంలోని త్రీటౌన్ పోలీసులు.. హుటాహుటిన బ్లూకోల్ట్స్‌కు సమాచారం అందించారు. చైతన్య వర్మఫోటో షేర్ చేయడంతో సమీపంలోని లాడ్జిలు, హోటళ్ళు చెక్ చేసి.. ఫోటోను చూపించారు. దీంతో.. రామ్‌నగర్‌లోని ఓ హోటళ్లో చైనత వర్మ ఉన్నట్లు తెలుసుకుని వెంటనే ఆ గదికి వెల్ళారు. తలుపు తెరిచి చూసే సరికి అప్పటికే.. కూల్ డ్రింక్ లోనూ, ఆహార పదార్థాల్లోనూ విషగుళికలు వేసుకుని తినేశాడు. హుటాహుటిన 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యమందించారు. పోలీస్, వైద్యుల శ్రమ ఫలించడంతో చైతన్యవర్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
చైతన్య వర్మ ప్రాణాలు దక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల పనితీరుకు అంతా శభాష్ అన్నారు. అయితే.. కారణమేదైనా ఓ నిండిప్రాణం బలవనర్మరణంతో పోతుందని తెలుసుకుని అలర్టైన పోలీసులే సమయానికి స్పందించకుంటే నిండు ప్రాణం గాల్లో కలిసిపోయేది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైతన్య వర్మ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also read:
ICC Player of the Month: భారత ఆటగాళ్లకు మరోసారి నిరాశే.. రేసులో ఉన్నా అవార్డులు దక్కలే..!