Vizag Steel Plant Elections: విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు కార్మిక సంఘ(Karmika sangham) ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అయిన ఎన్నికలు సాయంత్రం 4 వరకు జరుగుతాయి. ఈ రాత్రికే ఫలితాలు ప్రకటించనుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతోన్న ఈ ఎన్నికలను అన్ని గుర్తింపు సంఘాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు అధికార వైసీపీ(YCP) ఆశ్చర్యంగా కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐ ఎన్ టీ యూ సీ కి మద్దతు ఇస్తుండగా టీడీపీ(TDP) ఐటీయూసీ కిమద్దతు ప్రకటించింది. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించిన సీఐటీయూ ఒంటరిపోరాటమే చేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఎన్నికల్లో కార్మిక సంఘాలన్నీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. రెండేళ్ల క్రితమే గడువు ముగిసినప్పటికీ కరనో నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. సుమారు 10,580 మందికి పైగా ఓటర్లుండగా 9సంఘాలు బరిలోకి దిగాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం ఎన్నికల్ని నిర్వహిస్తోంది.
చివరి సారిగా 2018 లో జరిగిన ఎన్నికల్లో సీఐటీయూ 150 ఓట్లతో విజయం సాధించగా ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ లు కూడా దాదాపు గా 150, 200 ఓట్ల తేడాతో ఒడిపోయాయి. ప్రస్తుతం కుడా ఈ మూడు పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. అయితే ట్రేడ్ యూనియన్లలో అటు రాష్ట్రం లోని అధికార పార్టీ కి కానీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ కి కానీ బలం లేకపోవడంతో ఇతర పార్టీల అనుబంధ సంఘాలకు ఇవిమద్దతు ఇస్తున్నాయి. రాజకీయంగా బద్ధ శత్రువులు గా ఉన్న కాంగ్రెస్- వైసీపీ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఇప్పుడు కలిసి పోటీచేయడం ఆసక్తి గా మారింది. వైస్సార్టీయూసీ, ఐఎన్ టీయూసీ కి మద్దతు ప్రకటించడం సంచలనమైంది. స్వయంగా వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లు ఐఎన్టీయుసి ని గెలిపించాలని నేరుగా ప్రచారం కూడా నిర్వహించారు. దీనికి తోడు అధికార పార్టీ 2 కోట్లను ఖర్చు చేసి కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తోందని, ఈ ఎన్నికల్లో ఐఎన్ టీయూసీ విజయం సాధిస్తే రేపు ప్రైవేటీకరణ కు సహకరిస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ఇస్తోందని సీఐటీయూ, ఏఐటీయూసీ లు ప్రచారం ప్రారంభించాయి.
మరోవైపు టీడీపీ ఏఐటీయూసీ కి మద్దతు ఇస్తోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని పెద్ద ఎత్తున ఓటర్లను కలిశారు. ఏఐటీయూసీ ని గెలిపిస్తే ప్రైవేటీకరణను ఆపుతామంటూ శపథం చేస్తున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని అడ్డుకోవడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. ఐఎన్టీయూసీని గెలిపిస్తే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఏకపక్షం. అయిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఏఐటీయూసీ.బ్
ఇక బరిలో ఎన్ని యూనియన్లు ఉన్నా ప్లాంట్ పరిరక్షణ సిఐటియుతోనే సాధ్యమంటూ ప్రస్తుత గుర్తింపు సంఘం సీఐటీయూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సిఐటియు ఆధ్వర్యంలో సాధించిన ప్రయోజనాలివీ అంటూ తాము చేసిన పనులను చెప్తూ వెళ్తున్నారు వామపక్ష నేతలు.
ప్రస్తుతం ప్లాంట్‌లో అమలవుతున్న ఎన్నో ప్రయోజనాలు సిఐటియు గుర్తింపులో ఉండగా సాధించినవేనని, పూర్తి బేసిక్‌పై హెచ్‌ఆర్‌ఎ 20 శాతం, బోనస్ వంటి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను సిఐటియు చేకూర్చిందని, బిఐఎఫ్‌ఆర్ నుంచి ప్లాంట్‌ను తప్పించడం, ఎస్‌ఎంఎస్-2 సాధించడం, కోక్ ఓవెన్ బ్యాటరీల రక్షణకు పోరాడటం ఆ యూనియన్ ఆధ్వర్యంలో జరిగాయన మళ్లీ గెలిపిస్తే ప్రైవేటీకరణ ను అడ్డుకుని తీరుతామని గట్టిగా చెప్తున్నారు నేతలు. ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియుసి ప్యానల్ విషయంలో జరిగిన రహస్య ఒప్పందమేంటి ? అని,
ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియుసి యునియన్లను కూటమిగా కలపడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ఈ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్లు సీఐటీయూ గట్టుగా ప్రచారం చేస్తోంది. ఆ రెండు యూనియన్ల నాయకులతో ఢిల్లీలో పార్టీ పెద్దలు సమాలోచన జరిపారని, ఈ సమావేశాల వెనుక రహస్య అజెండా దాగి ఉందని సీఐటీయూ ప్రచారం చేస్తోంది. ఆ యూనియన్లతో కూడిన ప్యానల్ గెలిస్తే ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని గట్టిగా నిలువరించే ప్రయత్నం చేస్తోంది సీఐటీయూ
ప్రైవేటీకరణ తో పాటు ఆర్. కార్డుల జారీ, నిర్వాసితులకు ఉపాధి, పరిహారం వంటి విషయాలపై ఇప్పటికీ యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని. ఈ నేపథ్యంలో ఓటర్ల ఎవరివైపు మొగ్గు చూపుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరికి వారే మేమంటే మేమే గొప్పంటూ ఆయా కార్మిక సంఘాలు ప్రచారం చేసుకున్నాయి. అంతేకాకుండా పలు అంశాలపై యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు కూడా ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండబోతోంది.