Pregnant Woman: నాలుగు కిలోమీటర్లు డోలిలో ప్రసవ వేదన.. విశాఖ మన్యంలో తప్పని కష్టాలు..

|

Nov 20, 2021 | 2:58 PM

Pregnant Woman to hospital in Doli: అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. సకాలంలో వైద్యం అందక తల్లిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా.. అధికారులు మాత్రం చలించడం

Pregnant Woman: నాలుగు కిలోమీటర్లు డోలిలో ప్రసవ వేదన.. విశాఖ మన్యంలో తప్పని కష్టాలు..
Pregnant Woman
Follow us on

Pregnant Woman to hospital in Doli: అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. సకాలంలో వైద్యం అందక తల్లిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా.. అధికారులు మాత్రం చలించడం లేదు.. పాపం ఆ అమాయక గిరిజనుల తలరాతలు ఎన్నటికీ మారడం లేదు. మా గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నా.. అధికారులు చలించడం లేదు. ఏజెన్సీలో నిండు గర్భిణీ కి మళ్ళీ డోలి మోత తప్పలేదు. రహదారి సౌకర్యం లేక గ్రామానికి అంబులెన్స్ రాకపోవడంతో కిలోమీటర్లు మోసుకెళ్ళి అంబులెన్స్ ఎక్కించారు గ్రామస్తులు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని సింగి ఆదివాసీ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం ఉండదు. రోగం వచ్చినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా కాలినడకే వారికి దిక్కు. తీవ్ర అనారోగ్యం అయితే అప్పటికప్పుడు డోలి మోత మోయాల్సిందే. సింగి గ్రామానికి చెందిన గేమిల రాజేశ్వరి అనే మహిళ నిండు గర్భిణీ. ప్రసవ సమయం కావడంతో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆరోగ్యం క్రమంగా ఆందోళనకరంగా మారడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ గ్రామస్తులు ఆంబులెన్స్‌కు కాల్ చేశారు.

కొంత దూరం వచ్చిన అంబులెన్స్ అక్కడినుంచి గ్రామం వరకు రాలేకపోయింది . కారణమేంటంటే ఆ గ్రామానికి రోడ్డు ఉండదు. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. దీంతో ఇక చేసేది లేక.. గ్రామస్తులంతా డోలి కట్టారు. గర్భిణిని మోసుకుంటూ ముందుకుసాగారు. రాళ్ళు రప్పలు, వాగులు దాటుకుంటూ డోలి మోస్తూ పయనమయ్యారు. వైబి పట్నం వరకు వచ్చి ఆగిన అంబులెన్స్ వరకు.. డోలి మోస్తూ గర్భిణిని తరలించారు. అక్కడి నుంచి ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆంబులెన్స్‌లో తరలించి వైద్య సేవలు అందించారు.

అయితే సింగి, పెద్ద గోరువు, పితృ గడ్డ, నుండి చలి సింగం సికె పాడు వరకు ఏడు కిలోమీటర్ల పాటు గతంలో రహదారిన మంజూరైనా ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్ లేక ఆగిపోయింది. దీంతో ఆ రోడ్డు సమస్య యధాతథంగా కొనసాగుతూనే ఉందని గ్రామపెద్ద సత్తిబాబు తెలిపారు. రావికమతం మండలం చలి సింగం రోలుగుంట మండలంలో సింగి గ్రామాల ఆదివాసులు అనారోగ్యం పాలైతే డోలే మోయాలే తప్ప మరే ఆధారం లేదని పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గతంలో మంజూరైన నిలిచిపోయిన రోడ్డు పనులను ప్రారంభించి ఆదుకోవాలని సీపీఎం నేత గోవింద్ కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. అడవిబిడ్డల ఆక్రందన వినాలని కోరుతున్నారు. గతంలో మంజూరైన రోడ్డుకు అన్ని అనుమతులు క్లియర్ చేసి రహదారి సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు.

Also Read:

AP Politics: నందమూరి కుటుంబం నిజాలు తెలుసుకోవాలి.. ఏపీ మంత్రి పేర్నినాని

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!