
హోలీ అంటే రంగుల పండుగ. ఈ వేళ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. వయసు, పరపతితో తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రంగులు చల్లుకుని ఆనందంగా గడుపుతారు. కానీ హోలీ నాడు ఆ ప్రాంతంలో ఓ ప్రత్యేకత. అక్కడ రెండు రోజుల వేడుక..! అడవి నుంచి కట్టెలు తెచ్చి.. డెబ్భై అడుగుల కట్టెలు పేర్చి.. దానిపై జెండా కట్టి కాల్చి.. ఆ జెండా పడే సమయంలో ఏం చేయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్లపక్షం రోజున హెూళీ పండుగ నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి ఒడిశా నుంచి వలసవచ్చిన వాళ్ళు ఏటా హెూలీ పండుగ నిర్వహిస్తున్నారు. ఆంధ్రా-కాశ్మీర్‌గా పేరుగాంచిన లమ్మసింగి దగ్గరలోని తాజంగి గ్రామంలో హోళీ పౌర్ణమి రోజు ఈ పండగను చెయడము ఆనవాయితీ.
హోళీ పండుగ రెండురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముందురోజు పౌర్ణమిన రాధ కృష్ణలకు ప్రత్యేక పూజలు చేస్తారు. రాధాకృష్ణులు, పాకలపాడు గురుదేవుల విగ్రహాలను గిరిజన సాంప్రదాయాలతో కోలాటం, తప్పెట గుళ్లు, ఆదివాసీ నృత్యాలతో గుడి వద్ద నుంచి గ్రామ పురవీధుల్లో భారీగా ఊరేగిస్తారు. కట్టెలు తీసుకు రావటానికి అడవికి యువకులు వెళతారు. అక్కడ దాదాపు డెబ్భై అడుగుల చెట్టును వెతికి.. దానికి పూజలు చేసి నరుకుతారు.
హోళీ రోజు తెల్లవారుజామున ఉత్సవానికి సిద్ధమవుతారు. అత్యంత భక్తిశ్రద్ధలతో సుమారు 70 అడుగుల ఎత్తులో చెట్టుకు అనుగుణంగా కట్టెలను పేరుస్తారు. అంతేకాదు.. హోళీ కట్టెలపై ఓ జెండాను కూడా కడతారు. వేద మంత్రాలతో భక్తప్రహ్లాద హెూమం చేసి కట్టెల టవర్‌ను వెలిగిస్తారు. కట్టెలు కాలుతుండగా సంబరాలు చేసుకుంటారు. కట్టెలు పూర్తిగా కాలి ఆ సమయములో టవర్‌పై ఉన్న జెండా ఎటు వైపు పడుతుందో అటువైపు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం.
అంతేకాదు.. ఎత్తులో పేర్చిన కట్టెల టవర్లు కాలుతున్న సమయంలో పై నుండి పడుతున్న జెండాను పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడతారు. ఆ జెండా కింద పడకుండా ఎవరైతే ఛేజిక్కించు కుంటారో.. వారికి నగదు బహుమతితో సత్కరించి.. ఊరంతా ఊరేగిస్తారు. ఇంటి వరకు ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. ఇక ఈ ఏడాది వ్యవసాయన్ని జెండా పట్టుకున్న వ్యక్తితో ప్రారంభిస్తారు. ఆయనతోనే విత్తనాలు వేయించి వ్యవసాయ పనులు చేయిస్తారు. అప్పుడే దిగుబడులు బాగా వస్తాయని నమ్ముతారు స్థానికులు. ఇదీ తాజంగి గ్రామంలో జరిగే రాధాకృష్ణుల హోలీ పండగ ఉత్సవాల విశిష్టత. ఆదివాసి ప్రాంతంలో ఆనందాల వేడుక.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..