వర్షకాలంలో జోరుగా వర్షాలు పడతాయనుకుంటే ఒక్క చుక్క వర్షం లేదు పుడమి బీడువారుతుంది. వర్షాకాలం కదా చిన్న పాటి వర్షం కురిసినా నేలతల్లి తడుస్తుంది. ఏదో సాగు చేసుకొని బ్రతుకు బండి లాగొచ్చు అనుకున్న రైతన్నలకు ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. ఇక చేసేది లేక తమ పూర్వీకుల నుండి వస్తున్న వింత ఆచారాన్ని అమలు చేసి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తే వర్షం కురుస్తుందని గ్రామస్తులకు చెప్పి ఓ నిర్ణయానికి వచ్చారు గ్రామపెద్దలు. గ్రామ పెద్దల నిర్ణయం ప్రకారం వింత ఆచారంతో మొక్కలు కూడా చెల్లించారు.. అయితే గ్రామ పెద్దలు మాట విని పండుగలో పాల్గొన్న ఆ గ్రామస్తుల కోరిక ఆ దేవత తీర్చిందా? వారి ప్రయత్నం ఫలించిందా? వరుణుడు వారి చెంతకు చేరాడా? గ్రామ పెద్దలు చెప్పిన ఆచారం కరెక్టే అని గ్రామస్తులు విశ్వసించారా? ఇంతకీ ఎంటా వింత ఆచారం? ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల కోసం జరిగిన ఈ వింత ఆచారాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు చుట్టుపక్కల గ్రామస్తులు.
వర్షాల కోసం ఎదురు చూసి చూసి ఇక చేసేదిలేక తాము నమ్ముకున్న అమ్మవారికి గ్రామపెద్దల సలహాలు, సూచనల మేరకు మొక్కులు చెల్లించేందుకు వింత ఆచారాన్ని పాటించారు రైతులు. సాలూరు మండలం కూర్మరాజు పేటలో జరిగిన ఈ వింత ఆచారంలో గ్రామస్తులతో పాటు పలువురు ప్రక్క గ్రామాల వారు సైతం పాల్గొని సంప్రదాయ వింత ఆచారాన్ని ఫాలో అయ్యారు. కూర్మరాజుపేటలో జాకరమ్మ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువై ఉంది జాకరమ్మ తల్లి. అమ్మవారిని కొలిచి మొక్కులు చెల్లించి తమ ఆచారాన్ని కొనసాగించేందుకు నడకమార్గంలో గ్రామం నుండి వందలాది మంది గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఒకేసారి మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలతో కొండ పైకి వెళ్లారు. అక్కడకి వెళ్లిన తరువాత జాకరమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తరువాత మొక్కులు కోసం తమతో తీసుకువచ్చిన మేకలు, గొర్రెపోతులు, కోళ్లను అమ్మవారికి చూపించి బలి ఇచ్చారు. బలి కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారి కోసం పాయసం వండారు.
ఆచారం ప్రకారం ఆ పాయసాన్ని వరద పాయసం అని పిలుస్తారు. గ్రామస్తులు అందరూ కలిసి వండిన వరద పాయసాన్ని ముందుగా ఎవరికి వారే ఆకుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. తరువాత మిగిలిన పాయసాన్ని అమ్మవారి సమక్షంలోనే కొండ పనుగుగా పిలవబడే కటిక నేల పైన వడ్డిస్తారు. అలా వడ్డించిన పాయసాన్ని గ్రామంలోని రైతులు అంతా వరుసగా మోకాళ్ళ పై కూర్చొని నాలుకతో నాకుతారు. ఈ తంతు అంతా జరగటానికి సుమారు ఏడు గంటల సమయం పట్టింది. అలా ఆ తంతు పూర్తయిన తరువాత గ్రామస్తులు అంతా అప్పటికప్పుడే అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు. తాము చేసిన పూజల్లో నిజాయితీ ఉంటే, అమ్మవారికి తమ పై కరుణ ఉంటే, తాము పెట్టిన ప్రసాదానికి అమ్మవారు సంతోషిస్తే వర్షం పడేలా అనుగ్రహిస్తుందని వారి నమ్మకం. అంతేకాకుండా అలా వర్షం పడితే అమ్మవారు కరుణించిందని, తమ పంట పొలాల్లో సిరులు కురుపిస్తాయని వారి నమ్మకం. అలా విశ్వాసంతో ఎదురు చూసిన ఆ గ్రామస్తుల నమ్మకం ఫలించింది. అందరూ ఎదురు చూస్తుండగానే మేఘాలు కమ్ముకొని వర్షం ప్రారంభమై సుమారు గంట పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో గ్రామపెద్దలు చెప్పిన ఆచార వ్యవహారానికి గౌరవం దక్కింది.. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. అందరూ సంతోషంగా తిరిగి గ్రామానికి పయనమయ్యారు.