Hyderabad: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి బిగ్ రిలీఫ్.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు.. వేగంగా జర్నీ..

విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై వెళ్లేవారికి తీపికబురు. ఈ నెలాఖరు నుంచి కొత్త బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పనులన్నీ పూర్తవ్వగా.. త్వరలో ప్రారంభించనున్నారు. ఈ కొత్త రోడ్డు వల్ల హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట కలగనుంది. అలాగే విజయవాడలో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.

Hyderabad: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి బిగ్ రిలీఫ్.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు.. వేగంగా జర్నీ..
Viajyawada By Pass

Updated on: Mar 26, 2026 | 7:25 PM

విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా వైపు వెళ్లేవారికి గుడ్ న్యూస్. విజయవాడ బై పాస్ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ నెలాఖరు కల్లా ఈ బైపాస్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 47 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ ఉండనుంది. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు, గొల్లపూడి నుంచి కాజ వరకు 17 కిలోమీటర్లు ఉంటుది. ఇది అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గడంతో పాటు హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా వైపు వెళ్లేవారికి ప్రయాణం వేగవంతం కానుంది.

విజయవాడలోకి రాకుండానే..

ఈ బైపాస్ అందుబాటులోకి వస్తుండటంతో కోల్ కత్తా-చెన్నై నేషనల్ హైవే-16లో వెళ్లే వాహనాలు విజయవాడలోకి రావాల్సిన అవసరం ఉండదు. ఈ బైపాస్‌లో రెండు టోల్ గేట్లు ఉంటాయి. వెదురుపావులూరు వద్ద ఒక టోల్ ప్లాజా, వెంకటపాలెం వద్ద రెండో టోల్ గేట్ ఉంటుంది. ఈ వారంలోనే టోల్ ఛార్జీలను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ ఫీజులను వసూలు చేయనున్నారు. అటు చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు ఈ బైపాస్ ఉంటుంది. అంబాపురం బ్రిడ్జి వద్ద 90 మీటర్ల పనులు మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయి. అంబాపురం ల్యాంకో పవర్ హెచ్‌టీ విద్యుత్ లైన్ వద్ద బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోయింది. వాహనాలకు విద్యుత్ తీగలు తగలకుండా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ పనులు పూర్తి కానున్నాయి. అనంతరం ఈ కొత్త రోడ్డుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. కోల్ కత్తా-చెన్నై హైవే మీదుగా గుంటూరు, ఒంగోలు వెళ్లేవారికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే కాజ నుంచి గొల్లపూడి వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి గొల్లపూడి వైపు వెళ్లే వాహనాలను కూడా కాజ వైపు అనుమతించనున్నారు.

విజయవాడలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

ఈ హైవే వల్ల విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇంతకముందు వాహనాలు నగరం నుంచి వెళ్లేవి. ఈ బైపాస్ వల్ల నగరంలోకి రాకుండా వెళ్లవచ్చు. దీని వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అటు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా ముగిసింది. భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతి రూపురేఖలు మారనున్నాయి. అలాగే అమరావతిలో పలు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులే వేస్తోంది.

Follow Us