విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీది చెరగని ముద్ర. వంగవీటి రంగా మరణం తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లో వంగవీటి రాధా ఉన్నారు. గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా.. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. అయినా రాధాకృష్ణ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు రాధా. అయితే గత ఎన్నికల్లో మాత్రం బరిలో దిగలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత పేరుకు మాత్రమే టీడీపీలో ఉన్నారు తప్ప…ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది కూడా లేదు. అసలు రాధా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా అనే చర్చ కూడా జరిగింది. ఈ మధ్యనే టీడీపీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. ఇటీవల లోకేష్ పాదయాత్ర వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలకు పార్టీలకతీతంగా ఇతర నేతలతో కలిసి ముందుకు వెళ్తుంటారు.అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో ఉన్నారట వంగవీటి రాధా. అయితే పోటీ మాత్రం ఎక్కడి నుంచి చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.
జనసేనలో చేరాలని ఒత్తిడి చేస్తున్న అనుచరులు
వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై బెజవాడ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. 2004లో కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. ఆ తర్వాత 2009లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరపున పోటీచేసి సుమారు 900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో సెంట్రల్ నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలోకి దిగే యోచనలో రాధా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలి.. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే దానిపై చర్చించేందుకు ముఖ్య అనుచరులతో సమావేశం కావాలని నిర్నయించారు. రెండుసార్లు సమావేశం ఉంటుందని అనుచరులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత వాయిదా వేసారు. అయితే వంగవీటి రాధా అనుచరులు మాత్రం ఆయన్ను జనసేనలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటుపై ఆశ పెట్టుకున్నారు వంగవీటి రాధా.
అయితే అక్కడ ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కు సీటు దాదాపు ఖరారు చేసారు చంద్రబాబు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మెహన్ కు తిరిగి అదే స్థానం ఇవ్వనుంది టీడీపీ.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పై రాధాకు అంత ఆసక్తి లేదు. దీంతో విజయవాడలోనే తనకు సీటు కావాలని కోరుతున్న వంగవీటి రాధాకు టీడీపీ కృష్ణా జిల్లాలో అవనిగడ్డ స్థానాన్ని ప్రిఫర్ చేసినట్లు తెలిసింది.దీంతో విజయవాడ లో టీడీపీ నుంచి సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీడీపీని వీడి జనసేనలో చేరడం ద్వారా రాధాకు మరింత క్రేజ్ పెరుగుతుందని అనుచరులు చెబుతున్నారు.గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు మంచి సపోర్ట్ లభించింది.అందుకే రాధా సమావేశం ఏర్పాటుచేస్తే జనసేనలో చేరాలని కోరతామంటున్నారు ఆయన ముఖ్య అనుచరులు.మొత్తంగా వంగవీటి రాధా అనుచరులతో సమావేశం అవుతారనే వార్తలు బెజవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.మరి వంగవీటి నిర్నయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.