
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. తన భర్త అరెస్ట్ అక్రమం అని.. ఆయన అరెస్ట్ సమయంలోని విజయవాడ పటమట పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పిటిషన్ పేర్కొన్నారు. వంశీ అరెస్ట్ అక్రమమని తేల్చేందుకు ఆ సీసీ ఫుటేజ్ అవసరం ఉంటుందని.. అందుకే దానిని భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పటమట పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ సేఫ్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదని వంశీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దాంతో.. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనల తర్వాత తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే.. వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పటమట పోలీసులు అనుమతి కోరారు. ఇప్పటికే సత్యవర్థన్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. వంశీ బెయిల్ పిటిషన్‌తో కలిపి విజయవాడ పోలీసుల పిటిషన్‌ను కూడా ఇవాళ విచారించే అవకాశం ఉంది. ఇక.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి విజయవాడ కోర్టు ఈ నెల 17వరకు రిమాండ్ విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి