
వల్లభనేని వంశీ.. ఆంధ్రా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019లో టీడీపీ తరుఫున గెలిచిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో వైసీపీ సానుభూతిపరుడిగా మారాడు. అంతేనా.. టీడీపీ అగ్ర నేతలపై తన మార్క్ కామెంట్స్‌తో కాకరేపారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు కావడంతో, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక దశలో అసలు వంశీ బయటకు వస్తారా అని అనుకునే పరిస్థితి ఏర్పడింది. జైలులో కొన్ని నెలలు గడిపిన అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడిపారు. బాగా సన్నబడి.. జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీ.. ఆ తర్వాత కూడా అదే లుక్ కంటిన్యూ చేశారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా, ఇంటికే పరిమితమై కోర్టు కేసులపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఒక దశలో ఆయన వైఎస్సార్‌సీపీని వదిలి, రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటారని వార్తలు కూడా వినిపించాయి.
అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే.. అవన్నీ కేవలం రూమర్స్‌గానే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారు. తాజాగా వంశీ, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. గూడూరు ప్రాంతంలో జగన్‌తో కలిసి కారులో పంట నష్టాలను పరిశీలించిన వంశీని చూసి, ఆయన మళ్లీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయం అనుచరుల్లో నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.