AP Special Status News: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత రాగమే వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ చూపలేదని మరోసారి స్పష్టం చేసింది. పదిహేనో ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తీరును కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అడిగిన ప్రశ్నకు కేంద్రం.. పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. రెవెన్యూ లోటును కూడా అందజేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని కేంద్రం తెలిపింది. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదని పేర్కొంది. పన్నుల్లో వాటాను 32% నుంచి 42 శాతానికి పెంచినట్లు తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కూడా అదే తరహాలో సిఫార్సులు చేసిందని.. ఆ తర్వాత 41 శాతానికి సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. పన్నుల్లో వాటా, లోటు నిధుల సర్దుబాటు ద్వారా రెవెన్యూ లోటును సర్దుబాటు చేస్తున్నామని కేంద్ర పేర్కొంది. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని.. సంస్థల ఏర్పాటు అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని కేంద్రం లేఖలో పేర్కొంది.
విభజన చట్టం అమలుపై ఇప్పటికే 28 సార్లు సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద్ రాయ్.. ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
మరిన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తలు..