Hidden Treasure: డబ్బు ఆశతో గుప్తనిధుల వేటగాళ్లు చెప్పిన మాయ మాటలు విని కర్ణాటకకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రోళ్ళ మండలం హొట్టేబెట్ట గ్రామ సమీపంలోని కదిరెప్పకొండలో అతిపురాతనమైన కదిరెప్ప స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. అలర్ట్ అయిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడించారు. కదిరెప్ప స్వామి దేవాలయంల ఒక బండ కింద వజ్రాలు ఉన్నాయని క్షుద్రపూజలు చేసే స్వామి గవ్వల ఆధారంగా తెలిపారని వివరించారు. ఆయన చెప్పిన ప్రకారమే తవ్వకాలు చేపట్టినట్లు గుప్తనిధుల వేటగాళ్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, ఇందులో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఆరుగురు వ్యక్తులతో పాటు.. క్షుద్రపూజలు చేసే స్వామిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండలు పగుల గొట్టడానికి ఉపయోగించిన డిటోనేటర్లు, ఒక జనరేటర్, ఇతర యంత్ర సామాగ్రి, ఒక కారు, ఒక బైక్, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
AP Weather: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి పద్మ శ్రీ వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి శివసేన డిమాండ్