
కాకినాడ, సెప్టెంబర్ 2: ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి నదులు, ఏరులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి ధాటికి వీటిపై నిర్మించిన బ్రిడ్జిలు సైతం కూలిపోతున్నాయి. తాజాగా ఏలేరు కాలువ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలువ ఒడ్డున బట్టలు ఉతికేందుకు వెళ్లి.. ప్రమావశాత్తు ఏటిలో పడిపోయిన మరదలిని కాపాడేందుకు వదిన ప్రాణాలను పనంగా పెట్టింది. అయితే ఇద్దరూ నీళ్లలోకి కొటుకుపోవడంతో ఇద్దరి ప్రాణాలు గాల్లోకలిసి పోయాయి. దీంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
కాకినాడలోని ఏలేశ్వరంలో ఏలేరు కాలువలో కాలుజారి పడి వదినా, మరదలు మృతి చెందారు. బట్టలు ఉతటానికి ఏలేరు కాలువ దగ్గరికి ఏలేశ్వరానికి చెందిన పెండ్ర లక్ష్మి (36), ఆమె మరదలు పెండ్ర కుమారి (12) వెళ్లారు. అయితే ఏలేరు కాలవలో ప్రమాదవశాత్తు 12 సంవత్సరాల కుమారి కాలు జారి పడిపోయింది. దీంతో కుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వదిన లక్ష్మి కూడా నీటిలోకి దూకింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మునిగిపోయి నీళ్లల్లో గల్లంతయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరిని బయటకు తీశారు. వెంటనే హుటాహుటీన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గత కొంతకాలంగా ఏలేరు కాలవలో జేసీబీలతో ఇసుక తవడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. అందువల్లే లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మహిళలు చనిపోయారని కుటుంబ సభ్యులు వేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే సత్య ప్రభ మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.