ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం.. అప్రమత్తంగా ఉంటే ఆ ముగ్గురు ప్రాణాలతో మిగిలేవారే.. ఎదురుగా వస్తున్న మృత్యువును గ్రహించలేక ముందుకు వెళ్ళడంతో ఒక్కసారిగా జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆదివారం సెలవు కావడంతో ఆట విడుపుగా స్కూటీపై బయలుదేరిన ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితుడు అందరూ చూస్తుండగానే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడికి చేరుకున్నారు. గతంలో భర్త, ఇప్పుడు ఇద్దరు కొడుకులు కళ్ళెదుటే శవాలుగా మారడంతో ఆ మాతృమూర్తిని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.
ఒంగోలు సమీపంలోని కొప్పోలు దగ్గర బైక్ ను నీటి ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై వెళుతుండగా ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులు కొప్పోలు లోని ఎస్సీ కాలనీకి చెందిన 18 ఏళ్ల రేష్వంత్, 12 ఏళ్ల వికాస్, 9 ఏళ్ల విశాల్ గా గుర్తించారు.
వీరిలో వికాస్, విశాల్ ఇద్దరు అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ అన్నదమ్ముల తండ్రి కూడా గతంలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు నీరుగా వినిపిస్తున్నారు. గతంలో భర్త, ఇప్పుడు ఇద్దరు కొడుకులు మృత్యువాత పడటంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ఓదార్చడం తప్ప ఏం చేయాలో అర్ధంకాక బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి