Tirumala: ప్రైవేట్ హోటళ్ళకు టీటీడీ వార్నింగ్.. కొండపై ఫుడ్ క్వాలిటీ లేదంటే అంతే సంగతులు!

| Edited By: Balaraju Goud

Sep 18, 2024 | 5:45 PM

తిరుమలలో ప్రైవేట్ హోటళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫోకస్ పెట్టింది. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ చేసింది. ధరలు, రుచి, నాణ్యత తప్పందంటోంది. క్యాంటీన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్స్‌లో నిర్ధారించిన ధరలే అమలు కావాలంటోంది.

Tirumala: ప్రైవేట్ హోటళ్ళకు టీటీడీ వార్నింగ్.. కొండపై ఫుడ్ క్వాలిటీ లేదంటే అంతే సంగతులు!
Ttd On Safety Food
Follow us on

తిరుమలలో ప్రైవేట్ హోటళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫోకస్ పెట్టింది. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ చేసింది. ధరలు, రుచి, నాణ్యత తప్పందంటోంది. క్యాంటీన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్స్‌లో నిర్ధారించిన ధరలే అమలు కావాలంటోంది. హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో అవేర్‌నెస్ కల్పించారు టీటీడీ అధికారులు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన రుచికరమైన ఆహార లభ్యత లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల లడ్డు ప్రసాదం నుంచి అన్నదానం దాకా నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇక
తిరుమలలోని ప్రైవేట్ హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్‌లపై కొరడా ఝులిపించేందుకు టీటీడీ పాలకమండలి సిద్ధమైంది. కొండపై ధరల దోపిడీ, ఆహార నాణ్యత పట్ల వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆహార భద్రతా ప్రమాణాలు తోపాటు ధరల పై టీటీడీప దృష్టి పెట్టింది.

తిరుమలలో 729 దుకాణాలకు లైసెన్స్ ఉండగా అందులో 5 జనతా క్యాంటీన్లు, 6 బిగ్ హోటల్స్, 3 ఏపీ టూరిజం హోటల్స్, 144 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మరో 128 పార్సియల్ ఫాస్ట్ ఫుడ్ టీ స్టాల్స్ ఉన్నాయి. శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో కాకుండా కొందరు భక్తులకు స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. టీటీడీ అధికారికంగా అనుమతి ఇచ్చిన లైసెన్సడ్ స్టాల్స్ 729 మాత్రమే అయినా తిరుమలలో దాదాపు 3 వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి. టీటీడీ రెవెన్యూ, విజిలెన్స్ అండదండలతో అక్రమ దుకాణాలు పుట్టగొడుగుల వెలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ ఫుడ్ భక్తులకు చేరుతోంది. దీంతో తిరుమల కొండపై హోటళ్ల దందాకు టీటీడీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపై హోటల్లో ధరల దోపిడీకి గురి అవుతున్నట్లు గుర్తించిన అధికారులు నాణ్యత లేని ఆహారం తీసుకోవాల్సి వస్తుందని గుర్తించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. తిరుమలలో టీటీడీ లైసెన్స్ పొందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్లు తోపాటు చిన్నపాటి హోటళ్ళపై టీటీడీ కొరడా ఝులిపిస్తోంది. అక్రమంగా వెలిసిన దుకాణాల లెక్క టీటీడీ వద్ద లేకపోగా కొనసాగుతున్న ధరల దందాపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు యాక్షన్ లోకి దిగింది.

తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్‌లపై కొరడా ఝులిపించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆహార భద్రతా ప్రమాణాలు, ధరల పట్టిక తప్పనిసరి చేసిన టీటీడీ హోటళ్ళ నిర్వహణలో లోపాలను గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే కౌస్తుభం విశ్రాంతి భవనంలోని బాలాజీ ఉడ్ ల్యాండ్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేసి సీజ్ చేశారు. ఆహార నాణ్యత, ధరల దోపిడీ పై దృష్టి పెట్టిన టీటీడీ ఈవో శ్యామల రావు తిరుమలలో హోటళ్ళ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో హోటల్స్ నిర్వాహకులకు క్యాంటీన్ నిర్వహకులతో ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టంపై అవగాహన కల్పించారు. ఆహార భద్రతా చట్టాలు, శిక్షలు, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ విషయాలను తప్పక పాటించాలని నిర్ణయించిన టీటీడీ ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆహార పదార్థాల్లో వినియోగించే ముడి సరుకులు, శిక్షణ పొందిన సిబ్బంది, వారి వివరాలు, ఆహార ప్రమాణాలతో నాణ్యత పెంచాలంటున్న టీటీడీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ కంపల్సరీ చేసింది. నిబంధనలు పాటించడంతో పాటు తక్కువ ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాలంటోంది.

ఇక తిరుమల కొండకు వచ్చే భక్తుల్లో దాదాపు 2 లక్షల మంది దాకా భక్తులు టీటీడీ ఉచిత అన్న ప్రసాదం స్వీకరిస్తుండగా, వందలాది మంది భక్తులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్ళు, జనతా క్యాంటీన్లు, బిగ్ హోటల్స్ లో ఆహారాన్ని పొందుతున్నారు. దీంతో భక్తుల ఆకలి అవసరం తీర్చే పనిలో తిరుమలలోని ప్రైవేట్ హోటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు టీటీడీకి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ధరలతోపాటు రుచి నాణ్యత విషయంలో కూడా భక్తులు ఫిర్యాదులు చేస్తుండటంతో కొత్త ఈవో ప్రక్షాళన పేరుతో చేస్తున్న ప్రయత్నం హోటల్స్ నిర్వాహకుల దందాకు చెక్ పెట్టేలా ఉంది. ఈవో శ్యామల రావు తనిఖీలు, తీసుకుంటున్న నిర్ణయాలతో తిరుమల హోటల్స్ లో ధర పట్టికలు, ఆహార భద్రత చట్టాలు కంపల్సరీ చేస్తుండడం కొండపై హోటల్స్ మాఫియా లో దడ పుట్టిస్తోంది.

మరోవైపు తిరుమలలోని హోటళ్ళు, తినుబండారాల తయారీ దారులు అనుసరించాల్సిన పద్ధతులు, పాటించాల్సిన పరిశుభ్రత, పారిశుద్ధ్య పద్ధతులపై దిశా నిర్దేశం చేస్తున్న టీటీడీ తీరు భక్తుల ప్రశంసలు అందుకుంటుంది. ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక రసాయన జీవ ప్రమాదాలు, ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతులు, వృధా నిర్మూలన ప్రణాళిక పై అవగాహన కల్పిస్తున్న టీటీడీ చర్యలను భక్తులు స్వాగతిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) శిక్షణ పై అవగాహన కల్పిచేందుకు టీటీడీ చర్యలు తీసుకోవడం శుభ పరిణామం అంటున్నారు భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..