టీటీడీలో మార్పులు మొదలయ్యాయి. తిరుమల ప్రక్షాళనకు వేళయిందన్నట్లు విధానపరమైన మార్పులు ప్రారంభమయ్యాయి. కొత్త ప్రభుత్వం సమూల మార్పులు సంస్కరణలకు సిద్ధమైంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమన్నట్లు టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. సవాళ్లను ఎదుర్కొంటూనే సరిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల క్షేత్రం కొత్త ప్రభుత్వానికి హై ప్రియాలిటీ అయ్యింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టకముందే టిటిడి నుంచే పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రక్షాళన ప్రారంభమని ప్రకటించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదనీ తిరుమలలో గోవింద నామస్మరణనే మార్మోగాలన్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టిటిడి ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావుకు బాధ్యతలు అప్పగించారు. తిరుమలలో గతానికి భిన్నంగా పాలన కొనసాగేలా చర్యలు చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తులకు జీవితాంతం గుర్తుండి పోయేలా శ్రీవారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో పనులు చేపట్టారు. పారదర్శకంగా, అకౌంటబిలిటీ ఉండేలా టీటీడీ యంత్రాంగం పనితీరు ఉండాలని భావిస్తున్నారు టిటిడిఈఓ శ్యామల రావు.
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు ఆయన. సమూల మార్పుల లక్ష్యంగా అడుగులు వేస్తున్న టిటిడి ఇఓ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. భక్తులకు అందుతున్న వసతులు, ఎదురుగుతున్న ఇబ్బందులు తెలుసుకుంటూ టిటిడిలో ప్రక్షాళన షురూ చేశారు. ఇప్పటి దాకా టీటీడీలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపైనే ఫోకస్ పెట్టిన ఈఓ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విఐపి బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం సమయం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి శ్రీవాణి, సిఫారసు లెటర్స్‌తో వచ్చే వీఐపీల బ్రేక్ దర్శనాలు, డోనర్స్, ఉద్యోగుల బ్రేక్ దర్శనాలకు మధ్యాహ్నం 12 గంటల దాకా సమయం పడుతోంది. బ్రేక్ దర్శన సమయం వల్ల క్యూ లైన్లలో ఉండే సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం గగన మవుతోందన్న ఆలోచన చేస్తోంది. పాత విధానం మేలని భావిస్తోంది. శ్రీవారి నైవేద్య సమయంలోపే విఐపి బ్రేక్ దర్శనాలను ముగించాలన్న ఆలోచనలో టిటిడి ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
మరోవైపు తిరుమల కొండకు వచ్చే భక్తులకు వసతి పెద్ద సమస్యగా మారిందని గుర్తించిన కొత్త ప్రభుత్వం ఈ మేరకు దృష్టి పెట్టింది. సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న 7800 అతిథి గృహాలతో పాటు మరిన్ని పిలిగ్రీం ఎమినిట్స్ సెంటర్లను అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది. అవసరమైతే సామాన్య భక్తులు వసతి పొందేలా తిరుమలలో మరిన్ని భవనాలను నిర్మించి కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేసిన టీటీడీ ఈ మేరకు నిన్నటి నుంచే అమల్లోకి తెచ్చింది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల పునరుద్దరించిన టిటిడి శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద ఉన్న కౌంటర్లో టోకెన్లు స్కాన్ చేసుకోవాలన్న నిబంధన విధించింది. లేకుంటే దర్శనాలకు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఈ విధానం వల్ల భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాదిన్నరగా నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు జారీని నిలిపివేసిన టిటిడి ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. త్వరలో మరో 6వేల టోకెన్లకు పెంచనున్న టీటీడీ అలిపిరి నడక మార్గంలోనూ దివ్య దర్శనం టోకెన్లను త్వరలోనే ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. తాజా నిర్ణయంతో దళారులకు చెక్ పెట్టిన టీటీడీ అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచివెళ్లి శ్రీవారిని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి వెంకన్నను దర్శించుకునే భక్తులకు దాదాపు 20వేల టికెట్లు ఇవ్వనుంది. ఇలా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకంగా టిటిడి భావిస్తోంది. అన్న ప్రసాదం, లడ్డూల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం లాంటి అంశాలకు టాప్ ప్రియారిటీగా తీసుకుంది. గత కొంతకాలంగా అన్న ప్రసాదం లో నాణ్యత, లడ్డు ప్రసాదాల్లో రుచి కరువైందన్న భక్తుల విమర్శలను పరిగణలోకి తీసుకుంటున్న టీటీడీ నాణ్యతను పెంచేందుకు సిద్ధమైంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానంలో వరుస తనిఖీలు చేస్తున్న ఈఓ అన్న ప్రసాదాన్ని రుచి చూస్తూ భక్తుల నుంచి సమస్యలను తెలుసుకుంటున్నారు. రుచి, నాణ్యత విషయాలపై ఆరా తీస్తున్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్న ప్రసాదాలు, పారిశుధ్ద్యం, ఇతర సౌకర్యాలను అందించడం అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..