వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలుత అనుకున్నట్టుగా 10 రోజులు ఉండదని చెప్పారు. తిరుమలకు వచ్చిన విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతిని టీటీడీ ఛైర్మన్, ఆలయ ప్రధాన అర్చకుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో ఉత్సవమూర్తుల అరుగుదల కారణంగా నిత్యాభిషేకాల నిలుపుదల, పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనంపై ఆగమ సలహాదారులు, ఆలయ ప్రధానార్చకులతో కలిసి స్వరూపానందేంద్రతో చర్చించామని చెప్పారు. ఆయన సలహాలు స్వీకరించామని వివరించారు. దీనిపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి మాత్రం వైకుంఠ ఏకాదశి, ద్వాదశిరోజున మాత్రమే వైకుంఠద్వార దర్శనాన్ని కల్పిస్తామన్నారు.