Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత.. సీఎం చంద్రబాబు సంతాపం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 76 యేళ్ల వయసులో కన్నుమూశారు. గుండెపోటుతో తిరుపతి భవాని నగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మృతి చెందారు. క్లాసికల్‌ సంగీత విద్వాంసుడైన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా టీటీడీకి విశేష సేవలు అందించారు..

Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత.. సీఎం చంద్రబాబు సంతాపం
Garimella Balakrishna Prasad

Updated on: Mar 09, 2025 | 8:35 PM

తిరుపతి, మార్చి 9: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం (మార్చి 9) మృతి చెందారు. తిరుపతి భవాని నగర్‌లోని ఆయన ఇంట్లో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సంగీత విద్వాంసుడైన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా టీటీడీకి విశేష సేవలు అందించారు. అన్నమయ్య కీర్తనలను జనబాహుల్యం లోకి తీసుకెళ్లిన ప్రతిష్ట గరిమెళ్ళకే దక్కుతుంది. గరిమెళ్ళ పార్టీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి సంతాపం తెలియజేస్తున్నారు.

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘తిరుమల, తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారన్న వార్త బాధ కలిగించింది. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన శ్రీ గరిమెళ్ళ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాననని’ మంత్రి లోకేష్‌ సంతాపం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600 లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి. సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల, తిరుమల శ్రీ వారి సేవలో తరించారు. తన మధుర గాత్రంతో శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు.. అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొంటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.