Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..

అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి అడుగులు, మృత్యువు ఒడిలోకి చేరుతాయని ఎవరూ ఊహించలేదు. బై బై అమ్మా అంటూ చెప్పిన ఆ మాటలే ఆఖరి పలుకులవుతాయని తెలిస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోయేది కాదు. పాఠశాల ఆవరణలో అందం కోసం పెట్టిన ఒక బొమ్మ, ఆ ఏడేళ్ల చిన్నారికి యమపాశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
School Student Dies In Konaseema

Updated on: Jan 24, 2026 | 7:37 AM

స్కూల్ అంటే అక్షరాలు నేర్పే ఆలయం.. పిల్లలు కేరింతలు కొట్టే నందనవనం. కానీ అదే పాఠశాల ప్రాంగణం ఒక చిన్నారికి మృత్యుపాశమైంది. ఆడుకోవాల్సిన వయసులో, తోటి పిల్లలతో కలిసి గడుపుతున్న సమయంలో ఒక సిమెంట్ విగ్రహం రూపంలో మృత్యువు కబళించింది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న దివి జాహ్నవి శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల ఆవరణలో అలంకరణ కోసం ఉంచిన సిమెంట్ జింక బొమ్మ ఒక్కసారిగా చిన్నారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ఆ చిన్న ప్రాణం గాలిలో కలిసిపోయింది.

ప్రభుత్వం రూ.5లక్షలు

బై బై అమ్మ అంటూ వీడ్కోలు చెప్పిన చిన్నారి మళ్లీ తిరిగి రాదని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తన కళ్ళ ముందే చెల్లెలిపై విగ్రహం పడిపోవడం చూసిన అక్క తేజశ్రీ ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించినప్పటికీ, పోయిన ప్రాణాన్ని ఏ పరిహారం తిరిగి ఇవ్వగలదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..

ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జింక బొమ్మలను కేవలం నేలపై ఉంచారే తప్ప, వాటికి ఎటువంటి పటిష్టమైన పునాది వేయలేదు. బరువైన సిమెంట్ విగ్రహాలను కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా ఉంచడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పనుల కింద లక్షల రూపాయలు ఖర్చు చేసినా, దాతలు ఇచ్చిన విగ్రహాల ఏర్పాటులో ఇంజినీరింగ్ అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. కేవలం రంగులు, హంగులు మాత్రమే కాదు, పాఠశాల ఆవరణలో ఉన్న ప్రతి వస్తువు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందని, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.