తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మార్చి 22న శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అంతకుముందు మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరపనున్నట్లు పేర్కొంది. ఈ కారణంగా 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు. అలాగే మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ద్ద ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా నిలిపివేసినట్లు టీడీడీ సూచించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి