Tirumala: తిరుమలలో TTD చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు

Tirumala News: తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి భవనంలో హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Tirumala: తిరుమలలో TTD చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు
Ttd Chairman BR Naidu
Image Credit source: TTD

Updated on: Feb 01, 2025 | 5:13 PM

తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారంనాడు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన ⁠నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోటు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తిభావంతో ఉండాలని సూచించారు. పోటులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డూ కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని ఆలయంలోని లడ్డూ పోటును పరిశీలించారు. అక్కడ లడ్డూ తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు.

రథ సప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు..

కాగా తిరుపతి ఘటన నేపథ్యంలో ఫిబ్రవరి 4న రథ సప్తమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య జయంతి రోజున ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఒకే రోజు వివిధ వాహనసేవలు స్వామి వారికి నిర్వహిస్తున్నందున రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలుగా పరిగణిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తిరుమాడ వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్..