Tirupati By Elections : ఏడు కొండల సిటీ హీటెక్కింది. బైపోల్ టెంపరేచర్‌తో థర్మామీటర్ దడదడలాడిపోతోంది. తిరుపతి బైపోల్ ప్రచారాన్ని స్టార్ట్ చేసిన పార్టీలు ప్రత్యర్థులపై మాటలతో తూటాలు పేలుస్తున్నాయి. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న అధికార వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని పరిచయం చేస్తూ ఓటు అడుగుతున్నారు. పంచాయతీ నుంచి మున్సిపల్ వరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి ఓటు వేసి వేస్ట్ చేసుకోవద్దంటున్నారు.
నిన్న నారాయణవనం, వరదాయపాలెం, సత్యవేడులో సమావేశాలు నిర్వహించి వైసీపీని గెలిపించాలని మంత్రులు కోరారు. విజయం తమకు లెక్క కాదని… భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యమంటున్నారు. దేశమే తిరుపతి వైపు చూసేంత ఆధిక్యం వస్తుందని జోస్యాలు చెబుతున్నారు. సామాన్య కార్యకర్తకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇచ్చారని… ఇలాంటిది ఏ పార్టీలోనూ ఉండదన్నారు మంత్రులు. తాను ఎంపీగా గెలిస్తే ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానని.. తాను లోకల్ అంటున్నారు గురుమూర్తి.
మరోవైపు రెండేళ్లల్లో ఏం చేశారో వైసీపీ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు టీడీపీ అభ్యర్థి పనబాకలక్ష్మి. సత్యవేడులో గ్రామదేవతకు పూజలు చేసి క్యాంపెయిన స్టార్ట్ చేశారామె. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ… ఒక్క ఛాన్స్ అంటూ వంచన చేసి వైసీపీకి ఓటేసి మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. హోదా తెస్తామని ఒక్కసారి కూడా మోదీని గట్టిగా నిలదీయలేనివాళ్లకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ అంటు నినదిస్తున్న భారతీయజనతా పార్టీ అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టితో ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు పనబాక.
తిరుపతి డెవలప్‌మెంట్ క్రెడిట్ మాదే అంటున్న బీజేపీ… ఆ దిశగానే క్యాంపెయిన్ ప్లాన్ రెడీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ సహా నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఉపఎన్నిక ప్రచార వ్యూహాలపై చర్చించారు. రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఇక, పవన్ ప్రచారంపై అధికారిక ప్రకటనే తరువాయి.