Actress Hema in BJP: గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ హాస్యనటి హేమ.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభ వేదికగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నపభ తరఫున ఎన్నికల ప్రచారానికి హేమ సిద్ధమయ్యారు.
అనంతరం హేమ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు నవ్వులు పూయించాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా సరిగ్గా పలకక పోవడం, తర్వాత దాన్ని కవర్ చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ నవ్వులు తెప్పించాయి. ఇదిలా ఉంటే, తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికా.. లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా ఆమెకు క్లారిటీ లేకుండా పోయింది. అంతేగాక సభలో ఆమె ‘వకీల్ సాబ్’ సినిమా గురించి ప్రస్తావించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోదీ గురించి మర్చిపోయారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న బీజేపీ నేత… మోదీ గురించి మాట్లాడాలని చెవిలో చెప్పారు. అప్పుడు ఆమె ప్రధాని మోదీ కార్యక్రమాల గురించి ఏకరువు పెట్టారు. ఇలా ఆమె కన్ఫ్యూజన్‌తో సభ నవ్వులతో హోరెత్తింది.
తర్వాత, ప్రసంగం కొనసాగిస్తూ.. కాసేపు ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. చివరిగా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైన ఉప ఎన్నిక గురించి హేమ ప్రస్తావించారు. ఈ సందర్భంగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పేరు కూడా పలకడానికి హేమ ఇబ్బందిపడ్డారు. దీంతో ఆమె పక్కన ఉన్న వారు అభ్యర్థి పేరు ‘రత్నప్రభ’ అని చెప్పడంతో ఉన్నట్లుండి హేమ సీరియస్ అయ్యారు. పార్టీలో చేరి రెండు నిమిషాలు కాకముందే.. బీజేపీ నేతలకు ఓ రేంజ్‌లో షాకిచ్చారు. నాకు అన్నీ తెలుసు.. మీరేమీ చెప్పొద్దంటూ క్లాస్ పీకారు.
‘‘బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు.. నాకు తెలుసు సార్. నేను అన్నీ నేర్చుకునే వచ్చాను. ప్లీజ్.. మీరు నేర్పిస్తే, నేను నేర్చుకుని ఇక్కడ ప్రజల్లోకి చెప్పడానికి వచ్చానని మీడియా వాళ్లు రాసేస్తారు. ప్లీజ్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు కదా! నేనే చెబుతా! కాబట్టి, రత్నప్రభ గారిని మంచి ఓటు బ్యాంకుతో గెలిపించి కచ్చితంగా అసెంబ్లీకి మనందరి తరఫున పంపాలని కోరుకుంటున్నాను.’’ అంటూ బీజేపీ లీడర్ హేమ ఫుల్ కామెడీ చేశారు.
నాకు అన్నీ తెలుసు, మీరేమీ చెప్పొద్దు అంటూ బీజేపీ నాయకులపై అంతెత్తున లేచిన హేమ.. ఆ వెంటనే భయంకరమైన తప్పు చెప్పేసి అడ్డంగా బుక్కయ్యారు. జరిగేది లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికైతే.. రత్నప్రభను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రత్నప్రభను అసెంబ్లీకి పంపాలంటూ హేమ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు మాత్రం హేమ స్పీచ్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సీరియస్‌గా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో హేమా స్పీచ్‌తో నవ్వులు విరబూశాయి.