
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈఓ రిపోర్ట్ కీలకంగా మారనుంది.. టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈఓను ఆదేశించింది. టీటీడీ ఈఓ శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. టెండర్ ప్రక్రియ, పాల్గొన్న సంస్థలు, తక్కువ రేట్ కు కోట్ చేయడం వెనుక కారణాలు అన్నింటితో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈఓకు ప్రభుత్వం సూచించింది.. దీంతో ఆ నివేదికను తీసుకుని ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో కలవనున్నారు. ఈ సందర్భంగా కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు, రిపోర్టులతోపాటు పలు విషయాల గురించి చంద్రబాబుకు వివరించనున్నారు.
నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
లడ్డూ నెయ్యి వివాదంపై ఇప్పటికే స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి క్వాలిటీపై ఎప్పటి నుంచో ఫిర్యాదులొస్తున్నాయన్నారు. లడ్డూ పోటులో నెయ్యి క్వాలిటీపైనా ఎంక్వైరీ చేశానన్నారు. అనుమానాలు రావడంతో ల్యాబ్‌కు పంపించామన్నారు టీటీడీ ఈవో. అయితే.. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం ఓ కట్టుకథ అని కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..