తిరుపతి, ఆగస్టు 18: శేషాచలం కొండలు దేశంలోనే అతిపెద్ద అడవుల్లో మూడో స్థానంలో ఉంది. కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 8 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో శేషాచలం కొండలు విస్తరించి ఉన్నాయి.. ఈ కొండల్లోనే తిరుమల శ్రీవారి ఆలయం ఉంది. ఏడుకొండలుగా పిలువబడే గరుడాద్రి, శేషాద్రి, వృషబాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి కొండలు శేషాచలం అడవుల్లో భాగమే.. ఈ సప్తగిరులపైనే శ్రీవారు కొలువై ఉన్నారు. ప్రపంచంలోనే అరుదైన జీవజంతుజాలంతో పాటు, అరుదైన వృక్ష సంపద ఈ శేషాచల కొండల ప్రత్యేక. ఇవే కాక ప్రమాదకరమైన వన్యమృగాలకు కూడా శేషాచలం కొండలు ఆవాసంగా ఉన్నాయి. ఈ కొండల్లో చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో ఘాట్ రోడ్డు మార్గంలో భక్తులకు తరసపడ్డ చిరుతలు, ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియోలు మాధ్యమాల్లో అనేక సార్లు చూసే ఉంటారు.
ఇక ఇటీవల శ్రీవారి భక్తులపై దాడులకు పాల్పడిన ఘటనలు ఇప్పుడు భక్తుల్లో ఆందోళనలను పెంచాయి. కాలినడకన వెళ్లే భక్తులపై ఇటీవల జరిగిన రెండు దాడుల గురించి తెలిసిందే.. నెల రోజుల క్రితం కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన.. పది రోజుల క్రితం లక్షిత అనే బాలిక చిరుత దాడిలో మృతి చెందిన ఘటన తర్వాత శేషాచలం అడవుల్లో పులుల సంచారంపై మరింత ఆందోళన పెరిగింది.. బాలికపై దాడి ఘటన తర్వాత టిటిడి కాలినడక మార్గాల్లో 320 కి పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది.. 36 బోన్లు కూడా ఏర్పాటు చేయగా 50 రోజుల వ్యవధిలోనే 3 చిరుతలు చిక్కాయి.. అలాగే ఏర్పాటు చేసిన కెమెరాల్లో మరో మూడు చిరుతల సంచారం ఉన్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మూడు పట్టుబడగా.. మరో 3 చిరుతల సంచారాన్ని గుర్తించారు. చిరుతలే అనుకుంటే ఇటీవల ఒక ఎలుగుబంటి కూడా పదే పదే భక్తులు వెళ్లే మార్గంలో సంచరిస్తూ కలవర పెడుతోంది.
అయితే శేషాచలం కొండల్లో మొత్తం ఎన్ని చిరుత పులులు, ఎన్ని ఎలుగుబంట్లు ఉన్నాయనేది ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న ప్రశ్నం. ఆ వివరాల్లోకి వెళ్తే.. అటవీశాఖ అధికారులు 2016 లెక్కల ప్రకారం శేషాచలం కొండల్లో 36 చిరుతలు, మూడు ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. 2016 నాటి నుంచి నేటి వరకు సంతానోత్పత్తి ద్వారా ప్రస్తుతం చిరుతల సంఖ్య 50 దాటిందని అధికారులు గుర్తించారు.. ఎలుగుబంట్లు కూడా సుమారు 8 ఉన్నట్లు భావిస్తున్నారు.. ఇది భక్తుల్లో ఆందోళన కలిగించే విషయం. మరోవైపు రానున్న రోజుల్లో శేషాచలం కొండల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా, అభయారణ్య చట్టం ప్రకారం వన్యమృగాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతో చేయగలిగిందల్లా వాటిని పరిరక్షిస్తూ, శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించడమే ప్రస్తుతం అధికారుల బాధ్యతగా మారింది.